Chana Dal Namkeen : మనకు బయట శనగపప్పుతో చేసిన అనేక రకాల చిరుతిళ్లు లభిస్తూ ఉంటాయి. వాటిల్లో శనగపప్పుతో చేసే నమ్ కీన్ కూడా ఒకటి. కారంగా, కరకరలాడుతూ ఉండే ఈ నమ్ కీన్ చాలా రుచిగా ఉంటుంది. ఇలా బయట దొరికే నమ్ కీన్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో శనగపప్పుతో రుచిగా నమ్ కీన్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చనా దాల్ నమ్ కీన్ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – ఒక కప్పు, నీళ్లు – తగినన్ని, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్.
చనా దాల్ నమ్ కీన్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత అందులో తగినన్ని నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తరువాత జల్లిగంటె సహాయంతో శనగపప్పులోని నీరు అంతా పోయేలా వడకట్టుకోవాలి. తరువాత ఈ శనగపప్పును శుభ్రమైన కాటన్ వస్త్రం మీద వేసి తడి లేకుండా తుడిచి తరువాత గాలికి ఆరబెట్టాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి నూనెను బాగా వేడి చేయాలి. శనగపప్పును నేరుగా నూనెలో వేసి వేయించడానికి బదులుగా దానిని కొద్దిగా జల్లిగంటెలోకి తీసుకోవాలి.
ఇప్పుడు శనగపప్పును జల్లిగంటెతో సహా నూనెలో ఉంచి వేయించుకోవాలి. శనగపప్పును మధ్య మధ్యలో కలుపుతూ మధ్యస్థ మంటపై కరకరలాడే వరకు వేయించుకోవాలి. అలాగే వేయించేటప్పుడు శనగపప్పు మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా వేయించుకున్న శనగపప్పును టిష్యూ పేపర్ ఉంచిన గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా శనగపప్పునంతటిని వేయించుకున్న తరువాత గిన్నెలో ఉన్న టిష్యూ పేపర్ ను తీసేసి అందులో ఉప్పు, కారం, చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా కరకరలాడే చనా దాల్ నమ్ కీన్ తయారవుతుంది. దీనిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 15 నుండి 20 రోజుల వరకు తాజాగా ఉంటుంది.