Chicken Butter Masala : మనకు రెస్టారెంట్ లలో వివిధ రకాల చికెన్ వెరైటీలు లభిస్తూ ఉంటాయి. వాటిలో చికెన్ బటర్ మసాలా కూడా ఒకటి. చికెన్ తో చేసే ఈ వంటకం జ్యూసీగా, క్రీమీగా చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఎక్కువగా రోటీ వంటి వాటితో దీనిని తింటూ ఉంటారు. ఈ చికెన్ బటర్ మసాలాను రెప్టారెంట్ లలో లభించే దాని కంటే మరింత రుచిగా, మరింత కలర్ ఫుల్ గా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే చికెన్ బటర్ మసాలాను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ బటర్ మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, బటర్ – 2 టేబుల్ స్పూన్స్, కాశ్మీరి చిల్లీ పౌడర్ – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, నీళ్లు – 300 ఎమ్ ఎల్, ఉప్పు – తగినంత, కసూరి మెంతి – ఒక టీ స్పూన్, క్రీమ్ – 3 టేబుల్ స్పూన్స్, తేనె – ఒక టీ స్పూన్, గరం మసాలా – రెండు చిటికెలు.
గ్రేవీ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన టమాటాలు – పావు కిలో, బిర్యానీ ఆకు – 1, యాలకులు – 2, దాల్చిన చెక్క – అర ఇంచు ముక్క, కాశ్మీరీ చిల్లీ – 4, లవంగాలు – 2, వెల్లుల్లి – 4, అల్లం – అర ఇంచు ముక్క, మిరియాలు – అర టీ స్పూన్, జీడిపప్పు – 15, కసూరి మెంతి – అర టీ స్పూన్, ఉప్పు – కొద్దిగా, పంచదార – పావు టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – 1, బటర్ – 3 టేబుల్ స్పూన్స్, నీళ్లు – 250 ఎమ్ ఎల్.
చికెన్ మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలు..
చికెన్ బ్రెస్ట్ – 2, నిమ్మరసం – అర చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – కొద్దిగా, ఆవ నూనె – 2 టేబుల్ స్పూన్స్, కాశ్మీరి చిల్లీ పౌడర్ – ఒక టేబుల్ స్పూన్, పెరుగు – 4 టేబుల్ స్పూన్స్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, కసూరిమెంతి – అర టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, బ్లాక్ సాల్ట్ – అర టీ స్పూన్, ఆమ్ చూర్ – అర టీ స్పూన్, యాలకుల పొడి – అర టీ స్పూన్.
చికెన్ బటర్ మసాలా తయారీ విధానం..
ముందుగా చికెన్ బ్రెస్ట్ పీసెస్ ను తీసుకుని అర ఇంచు మందంతో 80 శాతం లోతుగా గాట్లు పెట్టుకోవాలి. తరువాత వీటిపై నిమ్మరసం, అల్లం పేస్ట్ వేసి ముక్కలకు బాగా పట్టించి పక్కకు ఉంచాలి. తరువాత మరో గిన్నెలో మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చికెన్ బ్రెస్ట్ పీసెస్ కు చక్కగా పట్టించి రాత్రంతా మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత మరో కళాయిలో నీళ్లు తప్ప గ్రేవీకి కావల్సిన పదార్థాలన్నీ వేసి 3 నిమిషాల పాటు వేయించాలి. తరువాత నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. ఇప్పుడు వీటన్నింటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత దీనిని తొలకలు లేకుండా జల్లెడలో వేసి జల్లించి పక్కకు ఉంచాలి.
ఇప్పుడు గ్రిల్ తవా మీద నూనుఎ, బటర్ వేసి వేడి చేయాలి. బటర్ కరిగిన తరువాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ను వేసి పెద్ద మంటపై 4 నిమిషాల పాటు వేయించాలి. దీనిని కదిలించకుండా అలాగే ఉంచాలి. 4 నిమిషాల తరువాత మరో వైపుకు తిప్పి చిన్న మంటపై కారుతున్న బటర్ ను చికెన్ పై రాస్తూ కాల్చుకోవాలి. దీనిని 20 నిమిషాల పాటు ఇలాగే కాల్చుకున్న తరువాత చికెన్ ను ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో 2 టీ స్పూన్ల నూనె, 3 టీ స్పూన్ల బటర్ వేసి వేడి చేయాలి. బటర్ కరిగిన తరువాత కాశ్మీరి చిల్లీ కారం, కారం, జీలకర్ర పొడి వేసి కలపాలి. తరువాత గ్రేవీ వేసి కలపాలి. ఇప్పుడు నీళ్లు పోసి కలిపి పెద్ద మంటపై 4 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత చికెన్, ఉప్పు వేసి కలపాలి.
దీనిపై మూతను ఉంచి మధ్యస్థ మంటపై బటర్ పైకి తేలే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత కసూరి మెంతి, 2 టేబుల్ స్పూన్ల బటర్, క్రీమ్, తేనె వేసి కలపాలి. బటర్ కరిగిన తరువాత కూర మధ్యలో చిన్న గిన్నెను ఉంచి అందులో కాల్చిన రెండు బొగ్గులను ఉంచాలి. తరువాత దానిపై కొద్దిగా నెయ్యి, గరం మసాలా వేసి మూత పెట్టాలి. దీనిని చిన్న మంటపై 3 నిమిషాల పాటు ఉడికించి తరువాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నెను తీసి వేయాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ బటర్ మసాలా తయారవుతుంది. దీనినిరోటి, నాన్, బటర్ నాన్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. రెస్టారెంట్ లకు వెళ్లే పని లేకుండా ఇలా ఇంట్లోనే చికెన్ బటర్ మసాలాను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.