Chicken Ghee Roast : చికెన్ తో మనం వివిధ రకాల వెరైటీ వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసే రుచికరమైన వంటకాల్లో చికెన్ ఘీ రోస్ట్ కూడా ఒకటి. ఇది మనకు ఎక్కువగా రెస్టారెంట్ లలో లభిస్తూ ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. సైడ్ డిష్ గా తినడానికి, చపాతీ, రోటీ, నాన్ వంటి వాటితో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ చికెన్ ఘీ రోస్ట్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా వెరైటీగా చికెన్ తో ఘీ రోస్ట్ ను తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ ఘీ రోస్ట్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ ఘీ రోస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – 3 లేదా 4 టేబుల్ స్పూన్స్, తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – 2 రెమ్మలు.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మెంతులు- పావు టీ స్పూన్, మిరియాలు -ఒక టీ స్పూన్, సోంపు గింజలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ధనియాలు – ఒకటిన్నర టేబుల్ స్పూన్, లవంగాలు – 5, ఎండుమిర్చి – 10, వెల్లుల్లి రెబ్బలు – 10.
మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలు..
చికెన్ – అరకిలో, ఉప్పు – ఒక టీ స్పూన్, నిమ్మరసం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, పెరుగు – ఒక కప్పు.
చికెన్ ఘీ రోస్ట్ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో చికెన్ ను తీసుకోవాలి. తరువాత ఉప్పు, నిమ్మరసం, పసుపు, పెరుగు వేసి బాగా కలపాలి. దీనిని ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో మసాలా పేస్ట్ కు వెల్లుల్లి రెబ్బలు తప్ప మిగిలిన పదార్థాలు వేసి వేయించాలి. ఇవన్నీ చక్కగా వేగిన తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు కూడా మెత్తని పొడిగా చేసుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత చికెన్ వేసి కలపాలి. దీనిని 20 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించిన తరువాత చికెన్ ముక్కలను ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మిక్సీ పట్టుకున్న పేస్ట్, ఉప్పు వేసి కలపాలి. దీనిని నెయ్యి పైకి తేలే వరకు ఉడికించిన తరువాత చికెన్ వేసి కలపాలి. తరువాత కరివేపాకు వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత చికెన్ మెత్తగాఅయ్యి నెయ్యి పైకి తేలే వరకు బాగా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ ఘీ రోస్ట్ తయారవుతుంది. దీనిని దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ చికెన్ ఘీ రోస్ట్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.