Chicken Masala Legs : చికెన్ తో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ తో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. చికెన్ లెగ్ పీసెస్ తో కూడా మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. రెస్టారెంట్ లలో, హోటల్స్ లో కూడా వివిధ రకాల చికెన్ లెగ్ పీస్ వంటకాలు మనకు లభ్యమవుతున్నాయి. చికెన్ లెగ్ పీసెస్ తో చేసే వంటకాలు కూడా చాలా రుచిగా ఉంటాయి. అందులో భాగంగా ఎంతో రుచిగా ఉండే చికెన్ మసాలా లెగ్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ మసాలా లెగ్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ లెగ్స్ – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, మైదా పిండి – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, పెరుగు – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, నిమ్మరసం – ఒక టేబుల్ స్పూన్.
చికెన్ మసాలా లెగ్స్ తయారీ విధానం..
ముందుగా లెగ్ పీసేస్ ను శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత వాటికి గాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి చికెన్ కు పట్టేలా బాగా కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి అరగంట పాటు అలాగే ఉంచాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ముందుగా సిద్దం చేసుకున్న చికెన్ లెగ్ పీసెస్ ను వేసి ఫ్రై చేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ మసాలా లెగ్స్ తయారవుతాయి. వీటిని పప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా కూడా తినవచ్చు. స్పెషల్ డేస్ లో, వీకెండ్స్ లో ఈ విధంగా చికెన్ మసాలా లెగ్స్ ను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.