Chicken Tikka Kebab : చికెన్ ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. చికెన్ తినడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. చికెన్ తో వివిధరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చేసే వాటిల్లో చికెన్ టిక్కా కబాబ్ కూడా ఒకటి. చాలా మంది టిక్కా కబాబ్స్ ను ఇష్టంగా తింటుంటారు. కానీ ఇవి మనకు బయట ఎక్కువగా దొరుకుతుంటాయి. వీటిని తయారు చేయడానికి తందూర్ లేదా ఓవెన్ తప్పకుండా ఉండాలి. కానీ ఇవి ఏవి లేకపోయినా కూడా ఇంట్లోనే చాలా సులువుగా మనం వీటిని తయారు చేసుకోవచ్చు. ఓవెన్, తుందూర్ లేకుండా చికెన్ టిక్కా కబాబ్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. వాటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ టిక్కా కబాబ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ బ్రెస్ట్ పీస్ – 300 గ్రా., ఉప్పు – ఒకటిన్నర టీ స్పూన్, కారం – ఒకటిన్నర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒకటిన్నర టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్, నిమ్మరసం – ఒక టేబుల్ స్పూన్, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి – అర టీ స్పూన్, తందూరీ మసాలా – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, నూనె – 2 టీ స్పూన్స్, చతురస్రాకారంలో పెద్దగా తరిగిన ఉల్లిపాయ – 1 (పెద్దది), చతురస్రాకారంలో పెద్దగా తరిగిన క్యాప్సికం – 1.
చికెన్ టిక్కా కబాబ్ తయారీ విధానం..
ముందుగా చికెన్ బ్రెస్ట్ పీస్ ని తీసుకుని కావల్సిన పరిమాణంలో ముక్కలుగా చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా , నిమ్మరసం వేసి బాగా కలిపి మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత ఉల్లిపాయ, క్యాప్సికంతో సహా మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక గంట పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. ఇప్పుడు చికెన్ ను గుచ్చడానికి తందూరి స్క్వీవర్స్ ను తీసుకుని వాటికి చికెన్ పీస్ లను, ఉల్లిపాయ ముక్కలను, క్యాప్సికమ్ ముక్కలను ఒకదాని తరువాత ఒకటిగా గుచ్చాలి.
ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని ఉంచి వేడయ్యాక చికెన్ ను గుచ్చి ఉంచిన తందూరి స్క్వీవర్స్ ను పెనం మీద ఉంచి పెద్ద మంటపై అటు ఇటు తిప్పుతూ మధ్య మధ్యలో నూనె లేదా బటర్ ను రాస్తూ చికెన్ పూర్తిగా ఉడికే వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ కు స్మోక్ ప్లేవర్ రావడానికి గాను స్టవ్ ఆన్ చేసి మంట మీద గుండ్రంగా తిప్పుతూ ఒక నిమిషం పాటు కాల్చుకుని ఒక ప్లేట్ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల బయట దొరికే విధంగా ఎంతో రుచిగా ఉండే చికెన్ టిక్కా కబాబ్స్ తయారవుతాయి. ఈ విధంగా మనం ఎటువంటి తందూర్, ఓవెన్ లేకుండానే చాలా సులువుగా చికెన్ టిక్కా కబాబ్ ను తయారు చేసుకోవచ్చు. వీటిని నేరుగా లేదా ఉల్లిపాయ, నిమ్మ రసంతో కలిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి.