Sambar Rice : సాధారణంగా రైస్‌తో చాలా మంది వివిధ రకాల వంటకాలను తయారు చేస్తుంటారు. ఎగ్ రైస్, టమాటా రైస్, పాలక్ రైస్.. ఇలా మనం వివిధ రకాల రైస్ వెరైటీలను తయారు చేసుకుని తినవచ్చు. అయితే సాంబార్ రైస్‌ను కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. టైమ్ ఎక్కువగా లేదనుకునే వారు సాంబార్ రైస్‌ను చాలా తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు. అలాగే దీన్ని లంచ్ బాక్స్ కోసం కూడా ప్రిపేర్ చేయవచ్చు. ఇక సాంబార్ రైస్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సాంబార్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక కప్పు, కంది పప్పు – ముప్పావు కప్పు, చింతపండు గుజ్జు – 30 గ్రా., పెద్దగా తరిగిన టమాట ముక్కలు – ఒక కప్పు, తరిగిన మునక్కాయ – 2, సన్నగా పొడుగ్గా తరిగిన క్యారెట్ – 2, తరిగిన క్యాప్సికం – 2, పొడుగ్గా తరిగిన పచ్చి మిర్చి – 4, పెద్దగా తరిగిన వంకాయలు – 3, పెద్దగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – ఒకటి, నూనె – 2 టేబుల్ స్పూన్స్, పసుపు – అర టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, సాంబార్ పౌడర్ – 5 టీ స్పూన్స్, బెల్లం తురుము – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – ఐదున్నర కప్పులు.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – 2 టీ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, ఎండు మిర్చి – 3, కరివేపాకు – ఒక రెబ్బ, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5, ఇంగువ – చిటికెడు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
సాంబార్ రైస్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యం, కందిపప్పు వేసి శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లను పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. తరువాత కుక్కర్ లో నూనె వేసి నూనె వేడయ్యాక ఉల్లిపాయలను, మునక్కాయ ముక్కలు, క్యారెట్ ముక్కలను వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత క్యాప్సికం, పచ్చి మిర్చి, వంకాయ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత నానబెట్టుకున్న బియ్యం, కందిపప్పును వేసి బాగా కలుపుకోవాలి. తరువాత పసుపు, కారం, సాంబార్ పౌడర్, ఉప్పు, బెల్లం తురుము, చింతపండు గుజ్జును వేసి బాగా కలుపుకోవాలి. తరువాత నీళ్లను పోసి కలిపి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
ఇలా ఉడికించిన తరువాత మూత తీసి రైస్ ను బాగా కలపాలి. ఇప్పుడు కళాయిలో నెయ్యి వేసి నెయ్యి వేడయ్యాక కొత్తిమీర తప్ప మిగిలిన తాళింపు పదార్థాలన్నీ వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగిన తరువాత ముందుగా ఉడికించిన రైస్ ను వేసి కలిపి 3 నిమిషాల పాటు ఉంచి చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సాంబార్ రైస్ తయారవుతుంది. ఈ రైస్ తయారీలో ఇతర కూరగాయ ముక్కలను కూడా ఉపయోగించవచ్చు. వేడి వేడిగా సాంబార్ రైస్ ను తినడం వల్ల రుచిగా ఉండడంతోపాటు శరీరానికి కావల్సిన పోషకాలు కూడా లభిస్తాయి. దీన్ని చాలా తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు. టైమ్ లేదనుకునే వారు సాంబార్ రైస్‌ను తయారు చేసుకుని తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.