Chicken Vellulli Vepudu : మనం చికెన్ తో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ తో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చికెన్ తో చేసుకోదగిన వివిధ రకాల వంటకాల్లో చికెన్ ఫ్రై కూడా ఒకటి. చాలా మంది ఈ చికెన్ ఫ్రైను ఇష్టంగా తింటారు. దీనిని రకరకాల రుచుల్లో తయారు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా రుచిగా, సులభంగా వెల్లుల్లి కారాన్ని వేసి చికెన్ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ వెల్లుల్లి వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – అరకిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, నిమ్మరసం – ఒక టీ స్పూన్, నూనె – ఒక టీ స్పూన్, ధనియాలు – రెండు టేబుల్ స్పూన్స్, మిరియాలు – 10, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 5, యాలకులు – 3, వెల్లుల్లి రెబ్బలు – 10, తరిగిన ఉల్లిపాయ – 1, వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూన్, చికెన్ మసాలా – ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 3, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
చికెన్ వెల్లుల్లి వేపుడు తయారీ విధానం..
ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, ఒక టీ స్పూన్ కారం, పసుపు, నూనె, నిమ్మరసం, అల్లం పేస్ట్ వేసి ముక్కలకు పట్టేలా బాగా కలుపుకుని పక్కకు ఉంచాలి. తరువాత ఒక జార్ లో ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, రెండు టేబుల్ స్పూన్ల కారం వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో రెండు టేబుల్ స్పూన్ ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. తరువాత ముందుగా సిద్దం చేసుకున్న చికెన్ ను వేసి కలపాలి. దీనిని మూడు నిమిషాల పాటు వేయించిన తరువాత మూత పెట్టి చికెన్ లోని నీరంతా బయటకు వచ్చే వరకు ఉడికించాలి.
తరువాత మూత తీసి నూనె తేలే వరకు వేయించాలి. చికెన్ చక్కగా వేగిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న కారం, చికెన్ మసాలా వేసి కలపాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రై తయారవుతుంది. దీనిని పప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తినవచ్చు. తరచూ చేసే చికెన్ ఫ్రై కంటే ఈ విధంగా తయారు చేసిన చికెన్ ఫ్రై మరింత రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.