Chikkudukaya Fry : అనేక పోషకాలు కలిగిన ఆహారాల్లో చిక్కుడుకాయలు ఒకటి. చిక్కుడు కాయల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. మనకు హైబ్రిడ్ చిక్కుడుతో పాటు నాటు చిక్కుళ్లు కూడా లభిస్తూ ఉంటాయి. నాటు చిక్కుళ్లతో చేసే ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ నాటు చిక్కుళ్లతో ఫ్రైను తయారు చేస్తూ ఉంటారు. రుచిగా, కరకరలాడుతూ ఉండేలా నాటు చిక్కుళ్లతో ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చిక్కుడుకాయ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
నాటు చిక్కుడుకాయలు – ముప్పావు కిలో, నూనె – 2 టేబుల్ స్పూన్స్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – 2 టీ స్పూన్స్ లేదా తగినంత.
చిక్కుడుకాయ ఫ్రై తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తుంచి, శుభ్రం చేసిన చిక్కుడుకాయలను వేసి కలపాలి. తరువాత ఉప్పు, పసుపు వేసి కలపాలి. ఇప్పుడు వీటిపై మూతపెట్టి చిక్కుడుకాయలను వేయించాలి. ఈ చిక్కుడు కాయలను మధ్య మధ్యలో కలుపుతూ సగానికి పైగా వేయించాలి. చిక్కుడుకాయ ముక్కలు సగానికి పైగా వేగిన తరువాత మూత తీసి కలుపుతూ పూర్తిగా వేయించాలి. చిక్కుడుకాయలను ఎర్రగా కరకరలాడే వరకు వేయించుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కారం వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై తయారవుతుంది. దీనిని పప్పు, చారు, మజ్జిగ చారు వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ ఫ్రైను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.