Chikkudukaya Pallikaram : చిక్కుడుకాయ పల్లికారం.. ప్రత్యేకంగా తయారు చేసిన పల్లికారం వేసి చేసే ఈ చిక్కుడుకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తినడానికి, పప్పు వంటి వాటితో సైడ్ డిష్ గా తినడానికి ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. ఈ చిక్కుడుకాయ పల్లికారాన్ని తయారు చేసుకోవడం చాలా సులభం. చాలా తక్కువ సమయంలో చాలా రుచిగా దీనిని తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ చిక్కుడుకాయ పల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చిక్కుడుకాయ పల్లికారం తయారీకి కావల్సిన పదార్థాలు..
చిక్కుడుకాయలు – పావుకిలో, పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 7 లేదా 8, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుకొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, పుట్నాల పప్పు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెమ్మలు – 10 నుండి 15, ఉప్పు – తగినంత, నూనె – 3 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – పావు టీ స్పూన్.
చిక్కుడుకాయ పల్లికారం తయారీ విధానం..
ముందుగా చిక్కుడుకాయలను వలిచి శుభ్రంగా కడిగి నీటిలో వేసి మెత్తగా ఉడికించి తీసుకోవాలి. తరువాత కళాయిలో పల్లీలు వేసి దోరగా వేయించాలి. తరువాత ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించి జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులోనే ఎండుకొబ్బరి ముక్కలు, పుట్నాల పప్పు, వెల్లుల్లి రెమ్మలు, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
తరువాత ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు, పసుపు వేసి కలపాలి. వీటిని 2 నుండి 3 నిమిషాల పాటు వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న కారం వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకుని మరో 2 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చిక్కడుకాయ పల్లికారం తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చిక్కుడుకాయ పల్లికారాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని పొందవచ్చు.