Chillu Garelu : మినపప్పుతో చేసే రుచికరమైన వంటకాల్లో చిల్లుల గారెలు కూడా ఒకటి. ఈ గారెలు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. అల్పాహారంగా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. సాధారణంగా ఈ గారెలు క్రిస్పీగా ఉండడానికి మనం వంటసోడాను ఉపయోగిస్తూ ఉంటాము. కానీ వంటసోడా వేయడం వల్ల గారెలు నూనెను ఎక్కువగా పీల్చుకుంటాయి. కనుక వంటసోడాను ఉపయోగించకపోవడమే మంచిది. మరీ వంటసోడా వేయకుండా గారెలు క్రీస్పీగా ఎలా వస్తాయి.. అని చాలా మందికి సందేహం వస్తుంది. కింద చెప్పిన విధంగా చేయడం వల్ల వంటసోడా వేయకుండా కూడా మనం ఈ చిల్లుల గారెలను క్రిస్పీగా తయారు చేసుకోవచ్చు. వంటసోడా వాడకుండా చిల్లుల గారెలను క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చిల్లుల గారెల తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపప్పు – ఒక కప్పు, ఉప్పు – తగినంత, బొంబాయి రవ్వ – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, చల్లటి నీళ్లు – ఒక కప్పు.
చిల్లుల గారెల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మినపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ పప్పును గ్రైండర్ లో వేసి చలల్టి నీళ్లు పోసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత పిండిని గిన్నెలోకి తీసుకుని అందులో ఉప్పు, బొంబాయి రవ్వ వేసి కలపాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పిండిని తీసుకుని చేతికి తడి చేసుకుంటూ పాలిథిన్ కవర్ పై లేదా అరటి ఆకుపై వడను వత్తుకోవాలి. తరువాత దీనికి మధ్యలో చిల్లు పెట్టి నూనెలో వేసి కాల్చుకోవాలి. ఈ వడలను మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల క్రిస్పీగా, రుచిగా ఉండే చిల్లుల గారెలు తయారవుతాయి. వీటిని చట్నీ, సాంబార్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి.