Chinthakaya Pachi Royyala Kura : నాన్ వెజ్ ప్రియులు చాలా మంది రక రకాల వెరైటీలను తింటుంటారు. చికెన్, మటన్, చేపలు.. ఇలా వివిధ రకాల మాంసాహారాలను చాలా మంది తింటుంటారు. అయితే వీటితోపాటు పచ్చి రొయ్యలను కూడా చాలా మంది తింటారు. వీటితో కూరలు, ఫ్రై, పులావ్, బిర్యానీ.. వంటివి చేసుకోవచ్చు. అయితే పచ్చి రొయ్యలను, చింతకాయలతో కలిపి వండితే కూర ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని చేయడం కూడా చాలా సులభమే. ఈ క్రమంలోనే పచ్చి రొయ్యలు, చింతకాయలతో కూరను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి రొయ్యలు, చింతకాయ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి రొయ్యలు – అర కిలో, చింతకాయలు – 100 గ్రాములు, ఉల్లిపాయలు – 3, పచ్చి మిర్చి – 2, కారం – 2 టేబుల్ స్పూన్లు, పసుపు – పావు టీస్పూన్, ఉప్పు – తగినంత.
పచ్చి రొయ్యలు, చింతకాయ కూరను తయారు చేసే విధానం..
పచ్చి రొయ్యలను బాగా కడిగి కాస్త పసుపు, ఉప్పు పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చి మిర్చి కచ్చా పచ్చాగా దంచాలి. దీంట్లోనే ఉడికించిన చింతకాయలను కూడా వేసి దంచాలి. కడాయిలో నూనె వేడి చేసి పచ్చి రొయ్యలు వేసి వేయించాలి. దీంట్లోనే ఉల్లిపాయ, చింతకాయ తొక్కు, కారం, ఉప్పు వేయాలి. బాగా వేగిన తరువాత నీళ్లు పోసి మూత పెట్టి తక్కువ మంట మీద దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించాలి. దీంతో ఎంతో రుచికరమైన పచ్చి రొయ్యలు, చింతకాయల కూర రెడీ అవుతుంది. దీన్ని అన్నం లేదా చపాతీల్లో తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.