Chinthapandu Pachadi : చింత‌పండు ప‌చ్చ‌డి ఇలా చేయండి.. అన్నం, టిఫిన్స్‌లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Chinthapandu Pachadi : మ‌నం వంట‌ల్లో పులుపు కోసం చింత‌పండును విరివిగా వాడుతూ ఉంటాము. చింతపండు వేసి చేసే పులుసు కూర‌లు, ర‌సం, సాంబార్ వంటివి చాలా రుచిగా ఉంటాయి. ఇలా వంట‌ల‌ల్లో వాడ‌డంతో పాటు కేవ‌లం చింత‌పండును ఉప‌యోగించి మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. చింత‌పండు ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ ప‌చ్చ‌డి చాలాకాలం పాటు నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యితో క‌లిపి ఈ ప‌చ్చ‌డిని తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ ప‌చ్చ‌డిని చాలాసుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ చింత‌పండు ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చింత‌పండు ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చింత‌పండు – రెండు పెద్ద నిమ్మ‌కాయలంత‌, ధ‌నియాలు – ఒక టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, జీల‌క‌ర్ర -అర టీ స్పూన్, నువ్వులు – 2 టీ స్పూన్స్, ఎండుమిర్చి – 20 నుండి 25, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – అర క‌ప్పు, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్స్, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 8, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

Chinthapandu Pachadi recipe in telugu make in this way
Chinthapandu Pachadi

చింత‌పండు ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా చింత‌పండును శుభ్రం చేసి క‌డ‌గాలి. త‌రువాత అది మునిగే వ‌ర‌కు నీటిని పోసి నాన‌బెట్టాలి. ఇప్పుడు ఈ చింత‌పండును నీరంతా పోయి గుజ్జుగా అయ్యే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో ధ‌నియాలు, మెంతులు, జీల‌కర్ర వేసి వేయించాలి. త‌రువాత నువ్వులు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ఒక ప్లేట్ లోకి తీసుకుని ప‌క్కకుఉంచాలి. త‌రువాత అదే క‌ళాయిలో ఎండుమిర్చి కూడా వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు జార్ లో ముందుగా వేయించిన దినుసులు, ఎండుమిర్చి వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత చింత‌పండు, ప‌సుపు, ఉప్పు వేసి మ‌రోసారి మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి.

త‌రువాత తాళింపుకు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు, వెల్లుల్లి రెబ్బ‌లు, క‌రివేపాకు, ఎండుమిర్చి వేసి తాళింపు చేయాలి. తాళింపు పూర్తిగా చ‌ల్లారిన త‌రువాత ప‌చ్చ‌డిలో వేసిక‌లపాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చింత‌పండు ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో పాటు అల్పాహారాల‌తో కూడా తిన‌వ‌చ్చు. ఈవిధంగా త‌యారు చేసిన ప‌చ్చ‌డి 2 నుండి 3 నెల‌ల పాటు తాజాగా ఉంటుంది.

Share
D

Recent Posts