Coconut Lassi : కొకోనట్ లస్సీ.. కొబ్బరి నీళ్లు, పెరుగు కలిపి చేసే ఈ లస్సీ చాలా రుచిగా ఉంటుంది. లస్సీ అనగానే చాలా మంది వేసవి కాలంలో మాత్రమే తాగుతారు అని అనుకుంటారు. కానీ ఈ లస్సీని ఎప్పుడైనా తాగవచ్చు. ఈ లస్సీని తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. శరీరానికి చలువ చేస్తుంది. దీనిని ఒక్కసారి తాగితే చాలు మళ్లీ మళ్లీ తాగాలనిపిస్తుంది. ఈ లస్సీని తయారు చేయడం చాలా సులభం. చిటికెలో దీనిని తయారు చేసుకోవచ్చు. ఎంతో కమ్మగా, రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసే ఈ కొకోనట్ లస్సీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొకోనట్ లస్సీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఐస్ క్యూబ్స్ – 5 లేదా 6, లేత కొబ్బరి – కొద్దిగా, పంచదార – పావు కప్పు, కొబ్బరి నీళ్లు – 150 ఎమ్ ఎల్, కమ్మటి చిక్కటి తియ్యటి పెరుగు – 250 ఎమ్ ఎల్.
కొకోనట్ లస్సీ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో ఐస్ క్యూబ్స్ ను వేసుకోవాలి. తరువాత ఇందులో కొబ్బరి బోండా నుండి తీసిన లేత కొబ్బరి వేసుకోవాలి. తరువాత కొబ్బరి నీళ్లు పోసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత పెరుగు వేసి హై స్పీడ్ మీద మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ లస్సీని గ్లాస్ లో పోసి మరిన్ని ఐస్ క్యూబ్స్ వేసి చల్ల చల్లగా సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొకోనట్ లస్సీ తయారవుతుంది. దీనిని తాగడం వల్ల మనకు రుచితో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఈ లస్సీని అందరూ ఎంతో ఇష్టంగా తాగుతారు.