Thotakura Vepudu : మనకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ మనం తినే ఆకుకూరలల్లో తోటకూర ఒకటి. తోటకూరను తినడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. శరీరంలో కొవ్వును తగ్గించి బరువు తగ్గాలనుకునే వారికి తోటకూర ఎంతగానో సహాయపడుతుంది. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. హైపర్ టెన్షన్ తో బాధపడే వారికి తోటకూర ఎంతో మేలు చేస్తుంది. తోటకూరలో ఉండే విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
వాతావరణ మార్పుల వల్ల వచ్చే వ్యాధుల బారిన పడకుండా చేయడంలో తోటకూర ఉపయోగపడుతుంది. శరీరానికి కావల్సిన విటమిన్స్ అన్నీ తోటకూరను తినడం వల్ల లభిస్తాయి. వంద గ్రాముల తోటకూరలో 716 క్యాలరీల శక్తి ఉంటుంది. క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, సోడియం, పొటాషియం వంటి మినరల్స్ తోపాటు కార్బొహైడ్రేట్స్, ప్రోటీన్స్ కూడా తోటకూరను తినడం వల్ల మన శరీరానికి లభిస్తాయి. తోటకూరను మనం ఎక్కువ నూనె వేసి ఎక్కువ సేపు వేయిస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల తోటకూరలో ఉండే పోషకాలు ఆవిరైపోతాయి. తోటకూరలో ఉండే పోషకాలు పోకుండా రుచిగా ఎలా వండుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తోటకూర వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
తోటకూర – 5 కట్టలు (మధ్యస్థంగా ఉన్నవి), ఎండు మిరప కాయలు – 5, ఎండు కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు – 5, పచ్చి మిర్చి – 2 (పొడుగ్గా తరిగినవి), జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, ఉల్లిపాయలు – 2 (పొడుగ్గా తరిగినవి), శనగపప్పు – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, నూనె – 1 టేబుల్ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా.
తోటకూర వేపుడు తయారీ విధానం..
ముందుగా తోటకూరను శుభ్రంగా కడిగి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఒక జార్ లో ఎండు మిరప కాయలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా కాకుండా కొద్దిగా పలుకు ఉండేలా పట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న తోటకూరను ఆవిరి మీద 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి కాగాక.. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక ముందుగా ఆవిరి మీద ఉడికించి పెట్టుకున్న తోటకూరతోపాటు రుచికి సరిపడా ఉప్పును, పసుపును వేసి కలుపుకోవాలి. దీనిని 5 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై వేయించిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఎండు మిరపకాయల మిశ్రమాన్ని వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తోటకూర వేపుడు తయారవుతుంది. తోటకూరలో ఉండే పోషకాలు పోకుండా ఉంటాయి. దీని వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.