Crispy Full Fish Fry : చేపల వేపుడు.. చేపలతో చేసే రుచికరమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. చేపల వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. సైడ్ డిష్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. చేపల వేపుడును ఒక్కొక్కరు ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా తయారు చేసే చేపల వేపుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువగా గోదావరి జిల్లాల్లో తయారు చేస్తూ ఉంటారు. ఈ చేపల వేపుడును తయారు చేయడం కూడా చాలా సులభం. మరింత రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ చేపల వేపుడును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చేపల వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
చైనా బురక చేపలు – 2, కారం – ఒకటిన్నర టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, నిమ్మరసం – అర చెక్క, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన కరివేపాకు – రెండు రెమ్మలు, నూనె – ఒక టేబుల్ స్పూన్.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – 2 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, కారం – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, నీళ్లు – ఒక టీ గ్లాస్.
చేపల వేపుడు తయారీ విధానం..
ముందుగా చేపలను శుభ్రం చేసుకోవాలి. తరువాత వాటికి మధ్య మధ్యలో గాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కారంతో పాటు మిగిలిన పదార్థాలన్నింటిని తీసుకుని బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చేపలకు బాగా పట్టించాలి. చేపల పొట్ట భాగంతో పాటు గాట్లు పెట్టుకున్న చోట కూడా ఈ మసాలాను పట్టించాలి. తరువాత ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. తరువాత కార్న్ ఫ్లోర్ తో పాటు మిగిలిన మసాలాను కూడా వేసి కలపాలి. తరువాత నీళ్లు పోస్తూ దోశ పిండిలా కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చేపలకు రెండు వైపులా పట్టించాటి. ఇప్పుడు కళాయిలో ఫ్రైకు సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె మధ్యస్థంగా వేడయ్యాక చేపలను వేసి వేయించాలి. చేప ఒకవైపు వేగిన తరువాత మరో వైపుకు తిప్పుకుని వేయించాలి. దీనిని రెండు వైపులా క్రిస్పీగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చేపల ఫ్రై తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన చేపల ప్రైను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.