Crispy Ravva Fingers : మనం రవ్వతో రకరకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. రవ్వతో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. రవ్వతో చేసుకోదగిన రుచిరమైన చిరుతిళ్లల్లో రవ్వ ఫింగర్స్ కూడా ఒకటి. ఇవి పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలారుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి అలాగే చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో వీటిని తయారు చేసుకోవచ్చు. ఎంతో క్రిస్పీగా, రుచిగా ఉండే ఈ రవ్వ ఫింగర్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బొంబాయి రవ్వ – అర కప్పు, వేడి నీళ్లు – అర కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు – 3, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, కారం – అర టీ స్పూన్, ఉప్పు- తగినంత, గరం మసాలా – పావు టీ స్పూన్, కసూరిమెంతి – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
ముందుగా ఒక గిన్నెలో రవ్వను తీసుకోవాలి. తరువాత ఇందులో వేడి నీళ్లు పోసి కలపాలి.దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. రవ్వ చక్కగా నానిన తరువాత ఇందులో బంగాళాదుంపలను ఉండలు లేకుండా తురిమి వేసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలను వేసుకోవాలి. ఇందులోనే రెండు 2 టీస్పూన్ల నూనె కూడా వేసి బాగా కలపాలి. ఇలా పిండిని సిద్దం చేసుకున్న తరువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఫింగర్స్ లాగా వత్తుకోవాలి. తరువాత వీటిని నూనె రాసిన ప్లేట్ పై వేసుకుని పక్కకు ఉంచాలి. ఇలా తగినన్ని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసివేడి చేయాలి. నూనె వేడయ్యాక ఫింగర్స్ ను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రవ్వ ఫింగర్స్ తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు వీటిని మరింత ఇష్టంగా తింటారు. ఈ విధంగా అప్పటికప్పుడు రవ్వతో రుచికరమైన ఫింగర్స్ ను తయారు చేసుకుని తినవచ్చు.