Custard Powder Ice Cream : ఐస్ క్రీమ్.. దీనిని రుచి చూడని వారు ఉండనే ఉండరు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ దీనిని ఇష్టంగా తింటారు. అలాగే కేవలం వేసవి కాలంలోనే కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు దీనిని తింటున్నారు. మనకు వివిధ రుచుల్లో రకరకాల ఐస్ క్రీమ్ లు లభిస్తూ ఉంటాయి. మన ఇంట్లోనే చాలా సులభంగా, రుచిగా ఐస్ క్రీమ్ ను తయారు చేసుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్ ను తయారు చేసుకోవడానికి మనం కస్టర్డ్ పౌడర్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ కస్టర్డ్ పౌడర్ తో ఐస్ క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కస్టర్డ్ ఐస్ క్రీమ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చిక్కటి పాలు – అర లీటర్, పంచదార – అర కప్పు, కస్టర్డ్ పౌడర్ – 2 టేబుల్ స్పూన్స్, వెనీలా ఎసెన్స్ – ఒక టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ – అర కప్పు, టూటీ ఫ్రూటీ – పావు కప్పు.
కస్టర్డ్ ఐస్ క్రీమ్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో పాలు పోసి వేడి చేయాలి. పాలు కొద్దిగా వేడయ్యాక పంచదార వేసి కలపాలి. ఈ పాలను 5 నుండి 6 పొంగులు వచ్చే వరకు బాగా మరిగించాలి. తరువాత ఒక గిన్నెలో కస్టర్డ్ పౌడర్ ను తీసుకుని అందులో పావు కప్పు పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో వేసి బాగా కలుపుకోవాలి. ఈ పాలను చిక్కబడే వరకు చిన్న మంటపై బాగా మరిగించాలి. పాలు చిక్కబడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి అందులో వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలపాలి. తరువాత ఈ పాలను పూర్తిగా చల్లారే వరకు ఉంచాలి. తరువాత ఈ పాలను మూత ఉండే గిన్నెలో పోసి 5 గంటల పాటు హై టెంపరేచర్ మీద డీ ఫ్రిజ్ లో ఉంచాలి. తరువాత ఫ్రీజ్ చేసిన పాలను జార్ లో వేసుకోవాలి.
ఇందులోనే ఫ్రెష్ క్రీమ్ ను వేసి హైస్పీడ్ మీద రెండు నుండి మూడు నిమిషాల పాటు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మూత ఉండే గిన్నెలోకి తీసుకుని అందులో టూటీ ఫ్రూటీలను వేసి కలపాలి. తరువాత దీనిపై మూతను ఉంచి ఒక రాత్రంతా లేదా 12 గంటల పాటు హై టెంపరేచర్ మీద డీ ఫ్రిజ్ ఉంచాలి. 12 తరువాత తీసి చూస్తే ఎంతో రుచిగా, మృదువుగా ఉండే కస్టర్డ్ ఐస్ క్రీమ్ తయారవుతుంది. ఈ విధంగా కస్టర్డ్ పౌడర్ తో ఇంట్లోనే ఎంతో రుచిగా ఎప్పుడు పడితే అప్పుడు ఐస్ క్రీమ్ ను తయారు చేసుకుని తినవచ్చు.