Cut Mirchi Fingers : క‌ట్ మిర్చి ఫింగ‌ర్స్ త‌యారీ ఇలా.. రుచి అమోఘం.. ఒక్క‌సారి ట్రై చేయండి..!

Cut Mirchi Fingers : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యాల్లో ల‌భించే చిరుతిళ్ల‌ల్లో క‌ట్ మిర్చీ బ‌జ్జీ కూడా ఒక‌టి. క‌ట్ మిర్చీ బ‌జ్జీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ క‌ట్ మిర్చి బ‌జ్జీని మ‌నం మ‌రింత రుచిగా మ‌రో విధంగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బ‌జ్జీ మిర్చితో చేసే ఈ క‌ట్ మిర్చి ఫింగ‌ర్స్ కూడా చాలా రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. రుచిగా క‌ర‌క‌రలాడుతూ ఉండేలా అంద‌రికి న‌చ్చేలా ఈ క‌ట్ మిర్చి ఫింగ‌ర్స్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క‌ట్ మిర్చీ ఫింగ‌ర్స్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బజ్జీ మిర్చి – పావుకిలో, నిమ్మ‌కాయ – 1, వాము – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్, శ‌న‌గ‌పిండి – 3 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ప్రైకు స‌రిప‌డా.

Cut Mirchi Fingers recipe in telugu very tasty snacks
Cut Mirchi Fingers

క‌ట్ మిర్చీ ఫింగ‌ర్స్ త‌యారీ విధానం..

ముందుగా బజ్జీ మిర్చిని నిలువుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత వాటిలో ఉండే గింజ‌ల‌ను తీసేసి చూపుడు వేళ్లంత ప‌రిమాణంలో ముక్క‌లుగా చేసుకోవాలి. త‌రువాత మిర్చీ ముక్క‌ల‌ను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో వాము, నిమ్మ‌రసం వేసి క‌లపాలి. వీటిని అర గంట పాటు అలాగే క‌దిలించ‌కుండా ఉంచాలి. త‌రువాత ఇందులో శ‌న‌గ‌పిండి, బియ్యం పిండి, ప‌సుపు, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని బ‌జ్జీ పిండిలా గ‌ట్టిగా క‌లుపుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి.

నూనె వేడ‌య్యాక ఒక్కో మిర్చి ముక్క‌ను తీసుకుని నూనెలో వేసి కాల్చుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క‌ట్ మిర్చీ ఫింగ‌ర్స్ త‌యార‌వుతాయి. వీటిని స్నాక్స్ గా తిన‌డానికి అలాగే ప‌ప్పు, సాంబార్ వంటి వాటిలో సైడ్ డిష్ గా తిన‌డానికి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఈ మిర్చి ఫింగ‌ర్స్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts