Dhaba Style Chole Masala : ధాబా స్టైల్‌లో చోలే మ‌సాలాను ఇలా చేస్తే.. ఎవ‌రైనా స‌రే లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Dhaba Style Chole Masala : ప్రోటీన్ లు ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో కాబూలీ శ‌న‌గ‌లు కూడా ఒక‌టి. వీటిలో ప్రోటీన్ల‌తో పాటు మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. కాబూలీ శ‌న‌గ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో చోలే మ‌సాలా కూడా ఒక‌టి. చోలే మ‌సాలా చాలా రుచిగా ఉంటుంది. చ‌పాతీ, నాన్ వంటి వాటితో తిన‌డానికి ఈ కూర చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ చోలే మ‌సాలా త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ చోలే మ‌సాలాను ధాబా స్టైల్ లో ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చోలే మ‌సాలా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కాబూలీ శ‌న‌గ‌లు – ఒక క‌ప్పు, దాల్చిన చెక్క – అర ఇంచు ముక్క‌, యాల‌కులు – 2, అనాస పువ్వు – 1, బిర్యానీ ఆకు – 1, టీ పౌడ‌ర్ – 2 టీ స్పూన్స్, నీళ్లు – 2 క‌ప్పులు, త‌రిగిన ట‌మాటాలు – 3, నూనె – 3 టేబుల్ స్పూన్స్, బ‌ట‌ర్ – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – ఒక క‌ప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, తరిగిన ప‌చ్చిమిర్చి – 3, ఆమ్ చూర్ పొడి – అర టీ స్పూన్, క‌సూరి మెంతి – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Dhaba Style Chole Masala recipe in telugu make in this way
Dhaba Style Chole Masala

మ‌సాలా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 3, యాల‌కులు – 2, మిరియాలు – ఒక టీ స్పూన్, ధ‌నియాలు – 2 టీ స్పూన్స్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, సోంపు గింజ‌లు – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 6 నుండి 8.

చోలే మ‌సాలా త‌యారీ విధానం..

ముందుగా శ‌న‌గ‌ల‌ను శుభ్రంగా క‌డిగి త‌గిన‌న్ని నీళ్లు పోసి రాత్రంతా నాన‌బెట్టాలి. త‌రువాత వీటిని ఒక కుక్క‌ర్ లోకి తీసుకోవాలి. ఇందులో దాల్చిన చెక్క‌, యాల‌కులు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. తరువాత రెండు టీ పౌడ‌ర్ బ్యాగ్ ల‌ను లేదా 2 టీ స్పూన్ల టీ పొడిని వ‌స్త్రంలో వేసి మూట క‌ట్టి కుక్క‌ర్ లో వేసుకోవాలి. త‌రువాత ఇందులో నీళ్లు పోసి మూత పెట్టి 4 నుండి 5 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆప్ చేసుకోవాలి. త‌రువాత మూత తీసి టీ పొడిని తీసి వేయాలి. త‌రువాత కొన్ని శ‌న‌గ‌ల‌ను తీసుకుని మెదుపుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో దాల్చిన చెక్క‌, ల‌వంగాలు, యాల‌కులు, మిరియాలు వేసి వేయించాలి.

వీటిని కొద్దిగా వేయించిన త‌రువాత ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, సోంపు గింజ‌లు వేసి వేయించాలి. త‌రువాత ఎండుమిర్చి వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చ‌ల్లారిన త‌రువాత జార్ లో వేసి పొడిలా చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. అలాగే ట‌మాటాల‌ను కూడా ఫ్యూరీలాగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో బ‌ట‌ర్, నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక దాల్చిన చెక్క‌, ల‌వంగాలు, బిర్యానీ ఆకు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా రంగు మారిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ఫ్యూరీ, ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత క‌రివేపాకు, ప‌చ్చిమిర్చి వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత ఆమ్ చూర్ పొడి, మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా వేసి క‌ల‌పాలి.

దీనిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత ఉడికించిన శ‌న‌గ‌ల‌ను నీటితో స‌హా వేసుకోవాలి. అలాగే మెదుపుకున్న శ‌న‌గ‌ల‌ను కూడా వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి 10 నుండి 15 నిమిషాల పాటు కూర ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి క‌సూరి మెంతి, కొత్తిమీర వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల దాభా స్టైల్ చోలే మ‌సాలా త‌యారవుతుంది. దీనిని చ‌పాతీ, రోటీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts