Dil Pasand : మనకు బేకరీలల్లో లభించే పదార్థాల్లో దిల్ పసంద్ కూడా ఒకటి. దిల్ పసంద్ తియ్యగా చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే వాటిల్లో ఇది కూడా ఒకటి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే చాలా మంది దిల్ పసంద్ ను మనం ఇంట్లో చేసుకోలేము అని భావిస్తూ ఉంటారు. కానీ దిల్ పసంద్ ను మనం ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఒవెన్ లేకపోయినా కూడా దిల్ పసంద్ ను మనం తయారు చేసుకోవచ్చు. బేకరీలల్లో లభించే దిల్ పసంద్ ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దిల్ పసంద్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి – ఒక కప్పు, ఉప్పు – చిటికెడు, వంటసోడా – పావు టీ స్పూన్, వేడి వేడి నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు లేదా కాచి చల్లార్చిన పాలు – తగినన్ని.
స్టఫింగ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండు కొబ్బరి పొడి – అర కప్పు, యాలకుల పొడి -అర టీ స్పూన్, తరిగిన జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, ఎండు ద్రాక్ష- 2 టీ స్పూన్స్, టూటీ ఫ్రూటీ – 4 టీ స్పూన్స్, పంచదార పొడి – అర కప్పు, నెయ్యి – 2 లేదా 3 టీ స్పూన్స్.
దిల్ పసంద్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, వంటసోడా వేసి కలపాలి. తరువాత నెయ్యి వేసి కలపాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. దీనిని చపాతీ పిండిలా కలుపుకున్న తరువాత మూత పెట్టి పక్కకు ఉంచాలి. తరువాత మరో గిన్నెలో స్టఫింగ్ కి కావల్సిన పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత కుక్కర్ లో లేదా వెడల్పుగా ఉండే గిన్నెలో ఒకటిన్నర కప్పుల ఉప్పు వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి వేడి చేయాలి.
తరువాత ముందుగా కలిపిన పిండిని మరోసారి కలుపుకోవాలి. తరువాత ఈ పిండిని రెండు భాగాలుగా చేసుకోవాలి. ఒక భాగం పిండి ఎక్కువగా ఉండేలా మరో భాగం పిండి తక్కువగా ఉండేలా చేసుకోవాలి. తరువాత చిన్నగా ఉన్న పిండిని తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ వీలైనంత పలుచగా రుద్దుకోవాలి. తరువాత దీనిపై నెయ్యిని రాసుకోవాలి. తరువాత పొడి పిండి చల్లుకుని రోల్ చేసుకోవాలి. తరువాత ఈ రోల్ ను మరలా గుండ్రంగా ఉండలా చుట్టుకుని మరలా మందంగా ఉండే చపాతీలా రుద్దుకుని పక్కకు ఉంచాలి. ఎక్కువగా ఉన్న పిండిని కూడా ఇదే పద్దతిలో ముందుగా పలుచగా వత్తుకుని నెయ్యి, పొడి పిండి రాసుకోవాలి. మరలా దీనిని కూడా రోల్ చేసుకుని గుండ్రంగా ఉండలా చుట్టుకోవాలి. తరువాత దీనిని పొడి పిండి చల్లుకుంటూ మందంగా ఉండే చపాతీలా వత్తుకోవాలి. ఇలా వత్తుకున్న తరువాత ఈ చపాతీ మధ్యలో స్టఫింగ్ ను ఉంచాలి.
తరువాత దీనిపై ముందుగా వత్తుకున్న చిన్న చపాతీని ఉంచి స్టఫింగ్ బయటకు రాకుండా వత్తుకోవాలి. తరువాత తడి చేసుకుంటూ చుట్టూ ఉన్న అంచులను మూసేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత దీనిపై నెయ్యిని రాసుకుని ఈ ప్లేట్ ను వేడి చేసుకున్న ఉప్పులో ఉంచి మూత పెట్టాలి. దీనిని మధ్యస్థ మంటపై 15 నిమిషాల పాటు బేక్ చేసుకున్న తరువాత మరో వైపుకు తిప్పి మరో 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. తరువాత బయటకు తీసి మరోసారి పైన నెయ్యిని రాసుకుని మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. పది నిమిషాల తరువాత మనకు కావల్సిన ఆకారంలో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పైన క్రిస్పీగా, తియ్యగా ఉండే దిల్ పసంద్ తయారవుతుంది. బయట కొనుగోలు చేసే పని లేకుండా ఇలా ఇంట్లోనే దిల్ పసంద్ ను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.