Lakshmi Devi : అమృతం కోసం దేవతలు, రాక్షసులు సముద్ర మథనం చేస్తారు తెలుసు కదా. ఆదిశేషువును తాడుగా చేసుకుని మందర పర్వతాన్ని కవ్వంగా మార్చి, ఆది కూర్మాన్ని ఆధారంగా చేసుకుని వారు క్షీర సాగరాన్ని మథిస్తారు. దీంతో దాని నుంచి అనేక వస్తువులు ఉద్భవిస్తాయి. అందులో నుంచి వచ్చే విషాన్ని శివుడు తన కంఠంలో దాచుకుంటాడు. అనంతరం కామధేనువు, ఐరావతం, ఉచ్ఛైశ్రవం, కల్పవృక్షం, అప్సరసలు, చంద్రుడు వంటి వారు క్షీరసాగర మథనం నుంచి ఉద్భవిస్తారు. చివరిగా లక్ష్మీదేవి కూడా వస్తుంది. అయితే అందరూ అన్నీ తీసుకుంటారు. కానీ లక్ష్మీ దేవిని మాత్రం ఎవరూ తీసుకోరు. తీసుకోరు అంటే.. ఆవిడే ఎవరి దగ్గరకు వెళ్లదు. కేవలం విష్ణువు వద్దకే వెళ్లి ఆయన్ను మాత్రమే వరిస్తుంది. అయితే లక్ష్మీదేవి అలా ఎందుకు చేస్తుందో తెలుసా..?
క్షీరసాగర మథనం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు మొదట ఆమె రుషులను చూస్తుంది. అయితే వారు ఆమెను తమ వద్దకు రమ్మంటే తమ వద్దకు రమ్మని ఆహ్వానిస్తారు. అయినా ఆమె వారిని వరించకుండా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే రుషులు ఎల్లప్పుడూ ఆగ్రహంతో ఉంటారని, వారికి వారిపై గర్వం ఎక్కువని, వారు మానవుల కన్నా అధికులమనే పొగరుతో ఉంటారని, దైవం వద్దకు ఎలాగైనా చేరుకోగలమనే అహం కలిగి ఉంటారని భావించి లక్ష్మీదేవి వారిని వరించకుండా ముందుకు వెళ్తుంది. అనంతరం ఆమె రాక్షసులను చూస్తుంది. కానీ వారి వద్దకు కూడా వెళ్లదు. ఎందుకంటే రాక్షసులు ఉండే ప్రాంతాలు అత్యంత అపరిశుభ్రంగా ఉంటాయని ఆమె నమ్మకం.
కేవలం స్వచ్ఛమైన, పరిశుభ్రమైన వాతావరణంలోనే ఉండాలని ఆమె అనుకుంటుంది. అందుకే రాక్షసులను కూడా కాదని లక్ష్మీదేవి ముందుకు వెళ్తుంది. అనంతరం ఆమె ఇతర దేవుళ్లను కూడా దాటి ముందుకు వెళ్తుంది. ఎందుకంటే వారు కష్ట పడే తత్వం ఉన్న వారు కాదని, వారి శక్తులన్నీ వారికై వారు సంపాదించినవి కావని ఆమె నమ్మకం. అలా లక్ష్మీదేవి దేవుళ్లను కూడా దాటి వెళ్తుంది. అప్పుడు ఆమెకు ఉలుకూ పలుకూ లేకుండా శేష తల్పంపై పడుకున్న విష్ణువు కనిపిస్తాడు.
అందరూ తనను తమ వద్దకే రావాలని ఆహ్వానిస్తుంటే ఆయన మాత్రం అలా తనను పట్టించుకోకుండా ఉండడం చూసి లక్ష్మీదేవి ఆశ్చర్యపోతుంది. వెంటనే ఓ నిర్ణయానికి వచ్చేస్తుంది, చేసుకుంటే విష్ణువునే వివాహం చేసుకోవాలని అనుకుంటుంది. అనుకున్నదే తడవుగా విష్ణువుకు పాదాభి వందనం చేసి తనను పెళ్లి చేసుకోవాలని ఆయన్ను అడుగుతుంది. అందుకు విష్ణువు అంగీకరిస్తాడు. అలా లక్ష్మీదేవి విష్ణువుకు భార్య అయింది.