Dondakaya Fry : దొండకాయ.. దీనిని చూడగానే చాలా మంది అసహ్యించుకుంటారు. కానీ దొండకాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. దొండకాయలో కూడా మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. కనుక దొండకాయలను కూడా తప్పకండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దొండకాయతో చేసుకోదగిన వంటల్లో దొండకాయ వేపుడు కూడా ఒకటి. పొడి పొడిగా లేకుండా అన్నంతో బాగా కలిసేలా రుచిగా దొండకాయ వేపుడును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దొండకాయ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
దొండకాయలు – 300 గ్రా., నూనె – 2 టేబుల్ స్పూన్స్, శనగ పప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన ఉల్లిపాయ – 1, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
కొబ్బరి కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – 2 టీ స్పూన్స్, ధనియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 5 లేదా తగినన్ని, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి ముక్కలు – పావు కప్పు, వెల్లుల్లిరెబ్బలు – 5.
దొండకాయ ఫ్రై తయారీ విధానం..
ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి గుండ్రంగా లేదా చిన్నగా ముక్కలుగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యక తాళింపు దినుసులు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత దొండకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి కలపాలి. తరువాత ఈ ముక్కలపై మూతను ఉంచి మధ్యస్థ మంటపై దగ్గరగా అయ్యే వరకు మధ్యమధ్యలో కలుపుతూ పూర్తిగా వేయించాలి. దొండకాయ ముక్కలు వేగుతుండగానే కళాయిలోశనగ పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి.
ఇవి వేగిన తరువాత నువ్వులు వేసి ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ దినుసులన్నీ చల్లగా అయిన తరువాత ఒక జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత ఇందులోనే పచ్చి కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. దొండకాయ ముక్కలు పూర్తిగా వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న కొబ్బరి కారాన్ని వేసి కలపాలి.
దీనిని మరో రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరను చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దొండకాయ ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల దొండకాయ ఫ్రై అన్నంతో కలవడంతోపాటు రుచిగా కూడా ఉంటుంది. కొబ్బరి కారం వేసి చేసే ఈ దొండకాయ వేపుడును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.