Dondakaya Pachadi : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో దొండకాయలు కూడా ఒకటి. కానీ చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడరు. కానీ వైద్యులు మాత్రం దొండకాయల్లో కూడా మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయని వీటిని కూడా తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. దొండకాయలతో చేసుకోదగిన వాటిల్లో దొండకాయ పచ్చడి కూడా ఒకటి. ఈ పచ్చడి తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. మొదటిసారి చేసేవారు, బ్యాచిలర్స్ కూడా ఈ పచ్చడిని చాలా సులవుగా తయారు చేసుకోవచ్చు. దొండకాయ పచ్చడిని రుచిగా,సులభంగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దొండకాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన దొండకాయలు – అరకిలో, పచ్చిమిర్చి – 15 లేదా తగినన్ని, నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత, వెల్లుల్లి రెబ్బలు – 8, జీలకర్ర – ఒక టీస్పూన్, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, నూనె – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ.
దొండకాయ పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసుకుని వేడి చేయాలి. నూనె వేడయ్యాక దొండకాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై వేయించుకుని చల్లారే వరకు పక్కకు ఉంచాలి. తరువాత ఒక జార్ లో వేయించుకున్న దొండకాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉప్పు, చింతపండు వేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి. తాళింపు వేగిన తరువాత దీనిలో ముందుగా తయారు చేసుకున్న పచ్చడిని వేసి కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దొండకాయ పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దొండకాయను ఇష్టపడని వారు కూడా ఈ పచ్చడిని లొట్టలేసుకుంటూ ఇష్టంగా తింటారు.