Drumstick Dal : మనలో చాలా మందికి మునగాకు వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసు. ఆయుర్వేదంలో కూడా మునగాకును రకరకాల వ్యాధులను తగ్గించడంలో ఉపయోగిస్తుంటారు. మునగాకు వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో మునక్కాయల వల్ల కూడా అన్నే ప్రయోజనాలు కలుగుతాయి. మునక్కాయల రుచి కూడా భలేగా ఉంటుంది. వీటిని మనం ఎక్కువగా సాంబార్ లో వేసుకుని తింటూ ఉంటాం. మునక్కాయలతో మనం పప్పును కూడా తయారు చేసుకోవచ్చు. వీటితో చేసే పప్పు చాలా రుచిగా ఉంటుంది. మునక్కాయ పప్పు తయారీకి కావల్సిన పదార్థాలను, తయారు చేసే విధానాన్ని.. ఇప్పుడు తెలుసుకుందాం.
మునక్కాయ పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
కంది పప్పు – 100 గ్రా., చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, తరిగిన టమాట ముక్కలు – అర కప్పు, తరిగిన పచ్చి మిర్చి ముక్కలు – పావు కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, చింత పండు – కొద్దిగా, నీళ్లు – సరిపడా.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
మునక్కాయ ముక్కలు – ఒక కప్పు, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, పచ్చి శనగ పప్పు – ఒక టీ స్పూన్, ఎండు మిరప కాయలు – 2, వెల్లుల్లి – 5 రెబ్బలు, కరివేపాకు – ఒక రెబ్బ, ఇంగువ – పావు టీ స్పూన్, నూనె – 2 టీ స్పూన్స్, కొత్తి మీర – కొద్దిగా.
మునకాయ పప్పు తయారు చేసే విధానం..
ముందుగా చింత పండును బాగా నానబెట్టి రసం తీసి పెట్టుకోవాలి. పప్పును బాగా కడిగి కుక్కర్ లో వేసుకోవాలి. ఈ కుక్కర్‌లో పప్పుతో పాటుగా ఉల్లిపాయ, టమాట, పచ్చి మిర్చి ముక్కలు వేసి , నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన పప్పులో ముందుగా తీసి పెట్టుకున్న చింత పండు రసం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి కాగాక మునక్కాయ ముక్కలు వేసి బాగా వేయించుకున్న తరువాత మునకాయ ముక్కలను తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇదే కళాయిలో మరి కొద్దిగా నూనె వేసి కొత్తి మీర తప్ప మిగిలిన తాళింపు పదార్థాలను వేసి వేగాక ముందుగా చేసి పెట్టుకున్న పప్పులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తాళింపు చేసుకున్న పప్పుపై మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తరువాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. మునక్కాయ పప్పును ఈ విధంగా చేసుకోవడం వల్ల చక్కటి వాసనతోపాటు రుచిగా కూడా ఉంటుంది.
మునగాకును, మునక్కాయలను తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. ఇందులోని విటమిన్స్ చర్మాన్ని సంరక్షించడంలో సహాయపడుతాయి. మునక్కాయలతో పప్పు చేసుకుని కూడా ఇలా ఓ వైపు రుచిని.. మరోవైపు ఆరోగ్యాన్ని పొందవచ్చు.