Dry Fish Fry : మనం చేపలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చేపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. మనం పచ్చి చేపలతో పాటు ఎండు చేపలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఎండు చేపలతో పులుసు, ఫ్రై వంటి వాటిని తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఎండు చేపలతో చేసే ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఎండు చేపల ఫ్రై సైడ్ డిష్ గా తినడానికి చాలా చక్కగా ఉంటుంది. చాలా మంది ఎండు చేపలు వాసన వస్తాయని వాటిని తినడానికి ఇష్టపడరు. కానీ చక్కగా కడిగి వండితే ఎండు చేపల ఫ్రై వాసన రాకుండా చాలా రుచిగా ఉంటుంది. ఎండు చేపల ఫ్రైను వాసన రాకుండా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎండు చేపల ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండు చేపలు – 5, కారం – 2 టీ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, నూనె – పావు కప్పు, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 6, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెమ్మ.
ఎండు చేపల ఫ్రై తయారీ విధానం..
ముందుగా చేపల మెడను తీసేసి పొట్ట భాగాన్ని నెమ్మదిగా శుభ్రం చేసుకోవాలి. మెడ తీసేయడం ఇష్టం లేని వారు మెడ కింద భాగంలో చిన్న రంధ్రాన్ని చేసి పొట్ట భాగాన్ని వత్తి శుభ్రం చేసుకోవాలి. తరువాత గరుకుగా ఉండే నేలపై రాళ్ల ఉప్పును వేసి చేపలను నెమ్మదిగా రుద్దాలి. తరువాత చేపలను నీటిలో వేసి వేళ్లతో రుద్దుతూ నెమ్మదిగా కడగాలి. నీళ్లు తెల్లగా వచ్చే వరకు ఈ చేపలను ఇలాగే రుద్దుతూ నెమ్మదిగా కడగాలి. తరువాత ఒక ప్లేట్ లో కారం, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న కారాన్ని ఎండు చేపలకు రెండు వైనులా పట్టించాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండు చేపలను వేసి వేయించాలి.
వీటిపై మూత పెట్టి మధ్య మధ్యలో అటూ ఇటూ తిప్పుతూ ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి కలపాలి. వీటిని మరో నాలుగు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చేపల ఫ్రై తయారవుతుంది. దీనిని పప్పు, సాంబార్, రసం వంటి వాటితో సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది.