Cockroach : సాధారణంగా చాలా మంది ఇళ్లలో బొద్దింకల బెడద ఉంటుంది. చీటికీ మాటికీ అవి మనకు కనిపిస్తుంటాయి. అవి మన కళ్ల ఎదురుగా కనిపిస్తే ఒళ్లు అంతా జలదరించినట్లు అవుతుంది. అయితే వాస్తవానికి ఇంట్లో బొద్దింకలు ఉండడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే.. సకల బాక్టీరియాలు, వైరస్‌లకు బొద్దింకలు నెలవుగా ఉంటాయి. కనుక అవి ఇంట్లో ఉన్నాయి అంటే.. మనకు వ్యాధులు వస్తాయని అర్థం. కనుక వీలైనంత త్వరగా వాటిని పారదోలాలి. అందుకు గాను కింద తెలిపిన చిట్కాలు పనిచేస్తాయి. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో ఎక్కడ ఆహారం పడ్డా వెంటనే శుభ్రం చేయాలి. లేదంటే బొద్దింకలు వస్తాయి. అలాగే ఇల్లు, కిచెన్ తదితర ప్రదేశాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. లేదంటే అవి బొద్దింకలకు ఆవాసాలుగా మారుతాయి. ఇక బొద్దింకలను తరిమేందుకు నాఫ్తలీన్ బాల్స్ ఉపయోగపడతాయి. బొద్దింకలు తిరిగే ప్రదేశాలతోపాటు ఇల్లు, కిచెన్ మూలల్లో నాఫ్తలీన్ బాల్స్‌ను ఉంచాలి. ఇవి బొద్దింకలను చంపవు. కానీ తరిమేస్తాయి. ఇలా బొద్దింకలను వదిలించుకోవచ్చు.
బొద్దింకలు తిరిగే చోట్ల కాస్త బోరిక్ యాసిడ్ పొడిని చల్లాలి. ఇది బొద్దింకలను చంపేస్తుంది. అయితే దీన్ని చల్లే చోట బాగా పొడిగా ఉండాలి. తడిగా ఉంటే ఇది పనిచేయదు. అలాగే దీన్ని చిన్నారులకు దూరంగా ఉంచాలి. లేదంటే వారికి ప్రమాదం ఏర్పడుతుంది. ఇలా బోరిక్ యాసిడ్‌తోనూ బొద్దింకలను తరిమేయవచ్చు. అలాగే బేకింగ్ సోడా, చక్కెర మిశ్రమం కూడా బొద్దింకలను తరిమేందుకు పనిచేస్తుంది. దీనికి గాను ఈ రెండింటినీ సమాన భాగాల్లో తీసుకోవాలి. అనంతరం రెండింటినీ బాగా కలపాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని బొద్దింకలు తిరిగే చోట ఉంచాలి. దీంతో చక్కెర బొద్దింకలను ఆకర్షిస్తుంది. అక్కడికి వచ్చే బొద్దింకలు బేకింగ్ సోడా బారిన పడి చనిపోతాయి. ఇలా బొద్దింకల పీడ వదిలిపోతుంది.
వేప నూనెను కాస్త తీసుకుని కొన్ని నీళ్లలో వేసి బాగా కలిపి అనంతరం ఆ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో పోసి ఇంట్లో స్ప్రే చేయాలి. లేదా వేపాకులను ఎండబెట్టి పొడిగా చేసి ఆ పొడిని చల్లినా కూడా బొద్దింకల నుంచి విముక్తి పొందవచ్చు. పుదీనా నూనెను నీటిలో కలిపి స్ప్రే చేసినా కూడా బొద్దింకలు పారిపోతాయి. అలాగే బిర్యానీ ఆకుల పొడిని కూడా చల్లవచ్చు. దీంతోనూ బొద్దింకలను తరిమేయవచ్చు. బొద్దింకలు తిరిగే చోట బిర్యానీ ఆకుల పొడిని చల్లితే మళ్లీ అవి అక్కడికి రావు. ఈ విధంగా పలు చిట్కాలను పాటించి బొద్దింకల పీడను వదిలించుకోవచ్చు.