Calcium : ప్రస్తుత కాలంలో కీళ్ల నొప్పులతో బాధపడే వారు రోజురోజుకూ ఎక్కువవుతున్నారు. అంతేకాకుండా చిన్న చిన్న దెబ్బలకే ఎముకలు విరగడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, రోజంతా అలసటగా, నీరసంగా ఉండడం, కండరాల నొప్పులు వంటి సమస్యలతో మనలో చాలా మంది సతమతమవుతున్నారు. శరీరంలో కాల్షియం లోపించడం వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఉన్నట్టుండి బరువు తగ్గడం, సన్నగా తయారవడం వంటి వాటికి కూడా శరీరంలో కాల్షియం లోపమే కారణమని వారు తెలియజేస్తున్నారు. కాల్షియం లోపం కారణంగా మరిన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది.
మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా మనం ఈ కాల్షియం లోపాన్ని అధిగమించవచ్చు. కాల్షియం అధికంగా ఉన్న ఆహార పదార్థాల్లో నువ్వులు కూడా ఒకటి. శరీరంలో వచ్చిన కాల్షియం లోపాన్ని అధిగమించడంలో ఇవి మనకు ఎంతగానో సహాయపడతాయి. నువ్వుల్లో తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు అనే రెండు రకాలు ఉంటాయి. ఏ రకం నువ్వులను తీసుకున్నా కూడా మనం ఈ సమస్యను అధిగమించవచ్చు. అయితే తెల్ల నువ్వుల్లో మన శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు , ఔషధ గుణాలు ఉంటాయి. ప్రతి రోజూ ఈ నువ్వులను ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత కాల్షియం లభించడంతోపాటు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కేవలం నువ్వులే కాకుండా వాటితోపాటు కొద్దిగా బెల్లాన్ని కలిపి తినడం వల్ల శరీరానికి అధికంగా మేలు జరుగుతుంది.
ఈ విధంగా నువ్వులను, బెల్లాన్ని కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత కాల్షియం లభించి ఎముకలు దృఢంగా మారి కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అధిక బరువుతో బాధపడే వారు రోజుకు ఒక టీ స్పూన్ నువ్వులను తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు కరిగి త్వరగా బరువు తగ్గుతారు. వీటిలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడుతుంది. గుండె జబ్బులు, పలు రకాల క్యాన్సర్ లు, టైప్ 2 డయాబెటిస్ వంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేసే శక్తి కూడా నువ్వులకు ఉంటుంది. నువ్వులను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది.
నువ్వుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో దోహదపడతాయి. కాల్షియం లోపంతో బాధపడే వారు ఈ నువ్వులను రోజుకు ఒక టీ స్పూన్ చొప్పున మధ్యాహ్నం భోజనం చేసిన మూడు గంటల తరువాత తీసుకోవాలి. వీటిని తిన్న వెంటనే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగాలి. నువ్వులను నేరుగా తినలేని వారు వాటిని పొడిగా చేసుకుని కూడా తినవచ్చు. శరీరంలో నొప్పులు ఎక్కువగా ఉన్న వారు ఈ నువ్వులను రోజుకు రెండు పూటలా కూడా తీసుకోవచ్చు.
పిల్లలకు కూడా ఈ విధంగా నువ్వులను ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. కొందరు పిల్లలు నువ్వులను నేరుగా తినలేరు. అలాంటి వారికి నువ్వులతో లడ్డూలను చేసి పెట్టడం వల్ల కూడా నువ్వుల్లో ఉండే పోషకాలు లభిస్తాయి. ఈ విధంగా నువ్వులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కాల్షియం లోపం అనే సమస్య నుండి బయటపడవచ్చు. తద్వారా కాల్షియం లోపం వల్ల వచ్చే సమస్యలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా ఈ విధంగా నువ్వులను తీసుకోవడం వల్ల భవిష్యత్తులో కాల్షియం లోపం అనే సమస్య రాకుండా ఉంటుంది.