Egg Keema Masala Curry : మనం కోడిగుడ్లను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కోడిగుడ్లు మన శరీరానికి కావల్సిన పోషకాలన్నింటిని కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ కోడిగుడ్లతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్లతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. కోడిగుడ్లతో చేసుకోదగిన వంటకాల్లో ఎగ్ కీమా మసాలా కర్రీ కూడా ఒకటి. దీనిని రెస్టారెంట్ లలో, ధాభాలలో ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. ఈ కీమా మసాలా కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. కోడిగుడ్లతో ఎగ్ కీమా మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ కీమా మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన కోడిగుడ్లు – 4, నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2 ( మధ్యస్థంగా ఉన్నవి), చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, చిన్నగా తరిగిన టమాటాలు – 2 ( పెద్దవి), జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, క్యాప్సికం తరుగు – పావు కప్పు, నీళ్లు – 125 ఎమ్ ఎల్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, నిమ్మరసం – ఒక టీ స్పూన్, బటర్ – ఒక టేబుల్ స్పూన్.
ఎగ్ కీమా మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. తరువాత అల్లం పేస్ట్, పసుపు వేసి వేయించాలి. అల్లం పచ్చి వాసన పోయిన తరువాత టమాట ముక్కలు, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, గరం మసాలా, మిరియాల పొడి, ధనియాల పొడి వేసి కలపాలి. టమాట ముక్కలు కొద్దిగా మెత్తబడిన తరువాత గంటెతో మెత్తగా చేసుకోవాలి. తరువాత ఈ టమాట ముక్కలను మెత్తగా అయ్యే వరకు బాగా వేయించాలి. తరువాత క్యాప్సికం ముక్కలను వేసి రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. దీనిని కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించిన కోడిగుడ్లను పెద్ద రంధ్రాలు ఉన్న గ్రేటర్ తో తురుముకుని వేసుకోవాలి.
తరువాత కొత్తిమీరును కూడా వేసి కలపాలి. దీనిని 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించిన తరువాత అల్లం ముక్కలు, నిమ్మరసం, బటర్ వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ ఖీమా మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటి, నాన్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే వంటకాల కంటే ఈ విధంగా చేసిన ఎగ్ ఖీమా మసాలా కర్రీ మరింత రుచిగా ఉంటుంది. లొట్టలేసుకుంటూ ఈ కూరను అందరూ ఇష్టంగా తింటారు.