Egg Masala Biryani : మనం కోడిగుడ్లతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్లతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. కోడిగుడ్లతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో మసాలా ఎగ్ బిర్యానీ కూడా ఒకటి. ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. బ్యాచిలర్స్, వంటరాని వారు కూడా ఈ బిర్యానీని తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ శ్రమతో, కుక్కర్ లో సులభంగా ఎగ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా ఎగ్ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన బాస్మతీ బియ్యం – ఒకటిన్నర కప్పు, నూనె – 6 టేబుల్ స్పూన్స్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, ఉడికించిన కోడిగుడ్లు – 4, బిర్యానీ ఆకు – 1, జాపత్రి – 1, దాల్చిన చెక్క – రెండు ఇంచులు, లవంగాలు – 6, యాలకులు – 5, జీలకర్ర – అర టీ స్పూన్, సాజీరా – అర టీ స్పూన్, కరివేపాకు – రెండు రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, చిన్నగా తరిగిన టమాటాలు – 2, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – కొద్దిగా, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, చిలికిన పెరుగు – ఒక కప్పు, తరిగిన కొత్తిమీర – రెండు టేబుల్ స్పూన్స్, తరిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, నిమ్మకాయ – 1, వేడి నీళ్లు – రెండుంపావు కప్పులు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్.
మసాలా ఎగ్ బిర్యానీ తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలను వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కోడిగుడ్లకు గాట్లు పెట్టుకుని వేసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు, చిటికెడు కారం వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కుక్కర్ లో మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, టమాట ముక్కలు వేసి వేయించాలి. టమాట ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కలపాలి.తరువాత రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి నూనె పైకి తేలే వరకు వేయించాలి.
తరువాత పెరుగు వేసి కలపాలి. దీనిని కూడా నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. నీళ్లు మరిగిన తరువాత బియ్యం, నెయ్యి వేసి కలపాలి. తరువాత పైన వేయించిన కోడిగుడ్లు, వేయించిన ఉల్లిపాయలు వేసి మూత పెట్టాలి. దీనిని పెద్ద మంటపై 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత మూత తీసి సర్వ్ చేసుకోవాలి. దీనిని చల్లటి రైతాతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన మసాలా ఎగ్ బిర్యానీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా ఎగ్స్ తో బిర్యానీని తయారు చేసుకుని తినవచ్చు.