Egg Masala Curry : చాలా తక్కువ ఖర్చుతో మన శరీరానికి కావల్సిన పోషకాలన్నింటినీ అందించే ఆహార పదార్థాలలో కోడి గుడ్డు ఒకటి. కోడి గుడ్డులో అనేక రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. బరువు పెరగాలనుకునే వారు, దేహ దారుఢ్యం కోసం వ్యాయామాలు చేసే వారు ప్రతి రోజూ కోడి గుడ్డును తినడం వల్ల ఫలితాలు అధికంగా ఉంటాయి. కోడి గుడ్డును తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల విటమిన్ డి లోపం సమస్య రాకుండా ఉంటుంది. చేపలను తినని వారు కోడి గుడ్డును తినడం వల్ల ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. కోడి గుడ్డును ప్రతి రోజూ ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఇక కోడి గుడ్డుతో రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా కోడి గుడ్డుతో మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కోడిగుడ్డు మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన కోడిగుడ్లు – 6, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయలు – 4 (మధ్యస్థంగా ఉన్నవి), చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 2, కరివేపాకు – ఒక రెబ్బ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన టమాటాలు – 2, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, పెరుగు – 100 గ్రా., నీళ్లు – తగినన్ని, ఉప్పు – రుచికి సరిపడా, కసూరి మెంతి – కొద్దిగా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
కోడిగుడ్డు మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో ఒక టీ స్పూన్ నూనె వేసి కాగాక పావు టీ స్పూన్ పసుపు, కారం, చిటికెడు ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన తరువాత ఉడికించిన ఎగ్స్ ను వేసి 2 నిమిషాల పాటు వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, మినపపప్పు వేసుకోవాలి. ఇవి వేగాక తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు తరిగిన టమాటా ముక్కలు వేసి కలిపి వేయించుకోవాలి. టమాటా ముక్కలు ఉడికిన తరువాత పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు వేసి కలిపి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లను పోసి కలిపి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు, రుచికి సరిపడా ఉప్పును వేసి కలిపి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత కసూరి మెంతి, తరిగిన కొత్తిమీర వేసి ఒక నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డు మసాలా కర్రీ తయారవుతుంది. అన్నం, చపాతీ, పూరీ, పుల్కా, దోశ, రాగి సంగటి వంటి వాటితో ఈ కూరను కలిపి తీసుకుంటే చాలా రుచిగా ఉండడమే కాకుండా కోడి గుడ్డులో ఉండే పోషకాలను పొందవచ్చు. కంటి చూపును, మానసిక స్థితిని మెరుగుపరచడంలోనూ కోడిగుడ్డు సహాయపడుతుంది.