Mamidikaya Pappu : పచ్చిమామిడి కాయలను చూడగానే మనలో చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. పచ్చి మామిడి కాయలను తినడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. మనం ఎక్కువగా పచ్చి మామిడి కాయలను ఉప్పు, కారంతో కలిపి నేరుగా తినడం లేదా ఏడాదికి సరిపోయేలా మామిడి కాయ పచ్చడిని తయారు చేసుకోవడం వంటివి చేస్తూ ఉంటాం. కొందరు మామిడి కాయలతో పప్పును కూడా తయారు చేస్తూ ఉంటారు. పచ్చి మామిడి కాయలతో తయారు చేసే పప్పు చాలా రుచిగా ఉంటుంది. పచ్చి మామిడి కాయలతో పప్పును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మామిడి కాయ పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – ఒక కప్పు, పచ్చి మామిడి కాయ – 1 (మధ్యస్థంగా ఉన్నది), నూనె- 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, పచ్చి మిర్చి – 2, కారం – రుచికి సరిపడా, పసుపు – అర టీ స్పూన్, ఎండు మిర్చి – 2, ఇంగువ – పావు టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 4 లేదా 5, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నీళ్లు – తగినన్ని.
మామాడి కాయ పప్పు తయారీ విధానం..
ముందుగా మామిడి కాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఒక కుక్కర్ లో కందిపప్పు, మామిడి కాయ ముక్కలు, పచ్చి మిర్చిని ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. తగినన్ని నీళ్లను పోసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తరువాత మూత తీసి గంటెతో పప్పును కొద్దిగా మెత్తగా చేసుకుని తగినన్ని నీళ్లను పోసి కలుపుకోవాలి. తరువాత ఉప్పు, పసుపు, తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగాక కారం వేసి కలిపి ఒక నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తాళింపును ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పులో వేసి కలుపుకోవాలి. ఇప్పడు కుక్కర్ ను స్టవ్ మీద పెట్టి పప్పును మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మామిడి కాయ పప్పు తయారవుతుంది.
అన్నంతో ఈ పప్పును తింటే చాలా రుచిగా ఉంటుంది. మామిడి కాయలు మనకు వేసవిలో మాత్రమే లభిస్తాయి. కనుక మామిడి కాయలను వరుగులుగా చేసి కూడా ఇలా పప్పులా చేసుకోవచ్చు. వివిధ రకాల ఆకు కూరలతో పప్పును తయారు చేసేటప్పుడు కూడా పచ్చి మామిడి కాయలను ఉపయోగించవచ్చు. పచ్చి మామిడి కాయలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం డీ హైడ్రేషన్ బారిన పడకుండా చేయడంలో పచ్చి మామిడి కాయ ఉపయోగపడుతుంది. పచ్చి మామిడి కాయలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె వంటి విటమిన్స్ అధికంగా ఉంటాయి. వీటిల్లో ఉండే ఫైబర్ కాలేయాన్ని శుభ్రపరచడంలో ఉపయోగపడుతుంది. జీర్ణ శక్తిని, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు, కంటి చూపును మెరుగుపరచడంలో, దంతాల సమస్యను తొలగించడంలో కూడా పచ్చి మామిడి కాయలు సహాయపడతాయి.