Egg Vada : మనం కోడిగుడ్లతో రకరకాల కూరలను తయారు చేస్తూ ఉంటాము. కూరలతో పాటు కోడిగుడ్లతో మనం వివిధ రకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. కోడిగుడ్లతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఎగ్ వడ కూడా ఒకటి. ఎగ్ వడ చాలా రుచిగా ఉంటుంది. పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే ఈ ఎగ్ వడ చాలా రుచిగా ఉంటుంది. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఒక్కసారి ఈ వడలను రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇవే కావాలంటారు. కోడిగుడ్లతో రుచిగా, క్రిస్పీగా ఉండేలా వడలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ వడ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన కోడిగుడ్లు – 4, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన కొత్తిమీర – ఒక టేబుల్ స్పూన్, శనగపిండి – 2 టేబుల్ స్పూన్స్, బ్రెడ్ క్రంబ్స్ – ఒక టీ స్పూన్, కోడిగుడ్డు – 1, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
ఎగ్ వడ తయారీ విధానం..
ముందుగా ఉడికించిన కోడిగుడ్లను మరీ సన్నగా కాకుండా కొద్దిగా అవుగా ఉండేలా తురుముకోవాలి. తరువాత ఈ తురుమును ఒక గిన్నెలోకి తీసుకుని అందులో మిగిలిన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. తరువాత కోడిగుడ్డును బాగా కలిపి వేసుకోవాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత కొద్ది కొద్దిగా కోడిగుడ్డు మిశ్రమాన్ని తీసుకుని ముందుగా ఉండలాగా చేసుకోవాలి. తరువాత వడలాగా వత్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వడలను వేసి వేయించాలి. వీటిని ఒక నిమిషం పాటు అలాగే ఉంచిన తరువాత అటూ ఇటూ తిప్పుతూ ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ వడలు తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా కోడిగుడ్లతో చాలా సులభంగా అప్పటికప్పుడు వడలను తయారు చేసి తీసుకోవచ్చు.