Garlic Soup : గార్లిక్ సూప్.. వెల్లుల్లితో చేసే ఈ సూప్ చాలా రుచిగా ఉంటుంది. చలికాలంలో ఈ సూప్ ను తాగడం వల్ల చలి నుండి ఉపశమనం కలగడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ సూప్ ను తాగడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ సూప్ ను తయారు చేయడం చాలా సులభం. పది నిమిషాల్లోనే ఈ సూప్ ను సులభంగా తయారు చేసుకోవచ్చు. గార్లిక్ సూప్ ను ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గార్లిక్ సూప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కార్న్ ఫ్లోర్ – 3 టీ స్పూన్స్, నీళ్లు – అర గ్లాస్, నూనె – ఒక టీ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు- 6, చిన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు – 4, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – అర టీ స్పూన్, చిల్లీ ప్లేక్స్ – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా .
గార్లిక్ సూప్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో అర గ్లాస్ నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత దంచిన, కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించిన తరువాత ఒకటిన్నర గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. నీళ్లు మరిగిన తరువాత ముందుగా కలిపిన కార్న్ ఫ్లోర్ నీళ్లు పోసి కలపాలి. తరువాత ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. తరువాత ఈ సూప్ ను మధ్యస్థ మంటపై రెండు నిమిషాల పాటు మరిగించిన తరువాత చిల్లీ ప్లేక్స్, కొత్తిమీర వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గార్లిక్ సూప్ తయారవుతుంది. వేడి వేడి గా ఈ సూప్ ను తాగితే మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు మనం ఈ సూప్ ను తయారు చేసి తీసుకోవచ్చు.