Ginger Chilli Chutney : హోటల్స్ లో, రోడ్ల పక్కన బండ్ల మీద మనకు అనేక రకాల అల్పాహారాలు, వివిధ రకాల చట్నీలు కూడా లభ్యమవుతూ ఉంటాయి. మనకు బండ్ల దగ్గర లభించే చట్నీలలో అల్లం పచ్చిమిర్చి చట్నీ ఒకటి. ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీ, దోశ, ఉప్మా, ఊతప్పం.. ఇలా ఎటువంటి అల్పాహారానైనా ఈ చట్నీతో తినవచ్చు. అచ్చం బయట లభించే విధంగా ఈ అల్లం పచ్చిమిర్చి చట్నీని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. రుచిగా ఈ అల్లం పచ్చిమిర్చి చట్నీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం పచ్చిమిర్చి చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
అల్లం ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, నూనె – అర టేబుల్ స్పూన్, మినపగుళ్లు – ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి – 3 లేదా తగినన్ని, జీలకర్ర – ఒక టీ స్పూన్, కరివేపాకు – రెండు రెమ్మలు, పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – పావు కప్పు, చింతపండు – ఒక చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 4, పుట్నాల పప్పు – పావు కప్పు, బెల్లం తురుము – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత.
అల్లం పచ్చిమిర్చి చట్నీ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మినపగుళ్లె వేసి దోరగా వేయించాలి. తరువాత అల్లం ముక్కలు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత తరువాత పచ్చిమిర్చి, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. తరువాత అందులోనే వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, పుట్నాల పప్పు, బెల్లం తురుము వేసి కలపాలి. ఇవీ అన్నీ కూడా చల్లగా అయిన తరువాత ఒక జార్ లోకి తీసుకోవాలి. తరువాత అందులో తగినంత ఉప్పును వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
తరువాత తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె, తాళింపు దినుసులు వేఇస తాళింపు చేసుకోవాలి. ఈ తాళింపును చట్నీలో వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అల్లం పచ్చిమిర్చి చట్నీ తయారవుతుంది. ఎటువంటి అల్పాహారాలనైనా ఈ చట్నీతో కలిపి తినవచ్చు.