Gobi Rice : మనకు రెస్టారెంట్ లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లో లభించే పదార్థాల్లో గోబి రైస్ ఒకటి. గోబి రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. క్యాలీప్లవర్ ఇంట్లో ఉండాలే కానీ ఈ గోబి రైస్ ను మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ గోబి రైస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోబి రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – 2 కప్పులు, పెద్ద ముక్కలుగా తరిగిన క్యాలీప్లవర్ – 1 ( మధ్యస్థంగా ఉన్నది), మైదాపిండి – 2 టేబుల్ స్పూన్స్, బియ్యం పిండి – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, సోయా సాస్ – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కొత్తిమీర – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, రెడ్ ఫుడ్ కలర్ – చిటికెడు,తరిగిన పచ్చిమిర్చి – 3.
గోబి రైస్ తయారీ విధానం..
ముందుగా క్యాలీప్లవర్ ముక్కలను 5 నిమిషాల పాటు వేడి నీటిలో వేయాలి. తరువాత వీటిని వడకట్టి నీళ్లు లేకుండా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, మైదాపిండి, బియ్యంపిండి, ఫుడ్ కలర్ వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ పిండి ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక క్యాలీప్లవర్ ముక్కలను పకోడీలా వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
తరువాత ఉప్పు, కారం, గరం మసాలా, మిరియాల పొడి, సోయా సాస్ వేసి కలపాలి. తరువాత అన్నం వేసి అంతా కలిసేలా బాగా కలపాలి. తరువాత క్యాలీప్లవర్ ముక్కలు, కొత్తిమీర వేసి పెద్ద మంటపై రెండు నిమిషాల పాటు బాగా కలిపి స్టవ్ ఆప్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోబి రైస్ తయారవుతుంది. దీనిని రైతాతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బయట కొనుగోలు చేసే పని లేకుండా ఈ విధంగా గోబి రైస్ ను ఇంట్లోనే తయారు చేసుకుని తినవచ్చు. క్యాలీప్లవర్ తో చేసే ఈ రైస్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.