Godhuma Pala Halwa : మనం ఆహారంగా తీసుకునే ధాన్యాల్లో గోధుమలు కూడా ఒకటి. గోధుమలను ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చన్న సంగతి మనకు తెలిసిందే. మనం సాధారణంగా గోధుమలను పిండిగా చేసి ఆ పిండి చపాతీ, రోటీ, పుల్కా వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. గోధుమలతో పిండినే కాకుండా పాలను కూడా తీయవచ్చు. అంతేకాకుండా ఈ పాలతో మనం ఎంతో రుచిగా ఉండే హల్వాను కూడా తయారు చేసుకోవచ్చు. గోధుమ పాలతో చేసే ఈ హల్వా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా సులభం. కర్ణాటక స్పెషల్ వంటకమైనా ఈ గోధుమపాల హల్వాను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమ పాల హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమలు – ఒక కప్పు, నీళ్లు – 3 కప్పులు, పచ్చి కొబ్బరి తురుము – ఒక కప్పు, బెల్లం తురుము – ఒకటింపావు కప్పు, నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – ఒక టీ స్పూన్.
గోధుమ పాల హల్వా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమలను తీసుకుని రెండు నుండి మూడు సార్లు శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తరువాత వీటిని మరోసారి కడిగి జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని మందంగా ఉండే కాటన్ వస్త్రంలో వేసి చేత్తో పిండుతూ పాలను వేరు చేసుకోవాలి. పాలను పిండగా మిగిలిన పిప్పిని మరలా జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో కొబ్బరి తురుము, నీళ్లు పోసి మరోసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత దీనిని కూడా కాటన్ వస్త్రంలో వేసి పాలను పిండుకుని పక్కకు ఉంచాలి. తరువాత ఒక గిన్నెలో బెల్లం తురుము, పావు కప్పు నీళ్లు పోసి వేడి చేయాలి.
బెల్లం కరిగిన తరువాత దీనిని వడకట్టుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే కళాయిలో ముందుగా తయారు చేసుకున్న గోధుమపాలను పోసి మధ్యస్థ మంటపై కలుపుతూ వేడి చేయాలి. ఇలా వేడి చేయగా 5 నిమిషాల తరువాత పాలు ఉండలుగా తయారవుతాయి. ఈ ఉండలను కలుపుతూ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి. గోధుమ పాల మిశ్రమం ఉండలు లేకుండా గంటె జారుడుగా అయిన తరువాత బెల్లం నీటిని పోసి అంతా కలిసేలా బాగా కలుపుతూ ఉండాలి. బెల్లం మిశ్రమం, గోధుమ పాల మిశ్రమం అంతా కలిసిన తరువాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, యాలకుల పొడి వేసి కలపాలి. రెండు నిమిషాల తరువాత మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలపాలి.
మరో రెండు నిమిషాల తరువాత మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ హల్వా మిశ్రమాన్ని నెయ్యి రాసిన ట్రేలోకి తీసుకుని పైన సమానంగా చేసుకోవాలి. దీనిని పూర్తిగా చల్లారిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని కావల్సిన ఆకారంలో ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమ పాల హల్వా తయారవుతుంది. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ హల్వాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.