Goruchikkudu Kaya Karam : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో గోరుచిక్కుడు కాయలు కూడా ఒకటి. ఇతర కూరగాయల వలె ఇవి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడరు. వీటితో చేసే ఏ కూరైనా రుచిగా ఉండదని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ కింద చెప్పిన విధంగా చేసే గోరుచిక్కుడుకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. అందరూ ఇష్టపడేలా ఈ గోరు చిక్కుడుకాయ వేపుడును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోరు చిక్కుడుకాయ కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
లేత గోరు చిక్కుడు కాయలు – 400 గ్రా., ఎండుమిర్చి – 8, ఎండు కొబ్బరి ముక్కలు – సగం చిప్ప, గసగసాలు – ఒక టేబుల్ స్పూన్, నూనె – పావు కప్పు, తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, గరం మసాలా – 2 చిటికెలు.
గోరుచిక్కడుకాయ కారం తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోరు చిక్కుడుకాయలను వేసి తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి వేడి చేయాలి. వీటిపై మూతపెట్టి గోరు చిక్కుడు కాయలను 80 శాతం వరకు ఉడికించాలి. తరువాత వీటిని నీటి నుండి తీసి అంచులను వేరు చేయాలి. తరువాత వాటిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు జార్ లో ఎండుమిర్చి, ఎండు కొబ్బరి ముక్కలు, గసగసాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
తరువాత పసుపు వేసి కలపాలి. ఇప్పుడు గోరు చిక్కుడు కాయ ముక్కలను, ఉప్పు వేసి కలపాలి. ఈ ముక్కలల్లో ఉండే నీరంతా పోయే వరకు వీటిని వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న కారం వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి చిన్న మంటపై 10 నిమిషాల పాటు వేయించాలి. తరువాత గరం మసాలా, కొత్తిమీర వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోరు చిక్కుడుకాయ కారం తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. గోరు చిక్కుడును ఇష్టపడని వారు కూడా ఈ వేపుడును ఇష్టంగా తింటారు.