Gorumiteelu : మనం పంచదారను ఉపయోగించి రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. పంచదారతో చేసే ఈ వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. పంచదారను ఉపయోగించి చాలా సులభంగా తయారు చేసుకోగలిగిన తీపి వంటకాల్లో గోరు మిటీలు ఒకటి. ఈ వంటకం పేరును మనలో చాలా మంది విని ఉండరు. కానీ గోరు మిటీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేసుకోవడం చాలా సులభం. తక్కువ సమయంలో రుచిగా చేసుకోగలిగే ఈ గోరు మిటీలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోరు మిటీల తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా పిండి – రెండు కప్పులు, బొంబాయి రవ్వ – అర కప్పు, ఉప్పు – చిటికెడు, వేడి చేసిన నూనె – 3 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, పంచదార – ఒక కప్పు, దంచిన యాలకులు – 4, నీళ్లు – అర కప్పు.
గోరు మిటీల తయారీ విధానం..
ముందుగా మైదా పిండిని జల్లించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అందులో రవ్వ, ఉప్పు వేసి కలపాలి. తరువాత వేడి నూనె వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఈ పిండి చపాతీ పిండి కంటే గట్టిగా ఉండేలా చూసుకోవాలి. తరువాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుంటూ కొద్దిగా సన్నగా పొడుగ్గా చేత్తో చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తరువాత పిండిని బొటన వేలు, చూపుడు వేలుతో పట్టుకుని బొటన వేలు గోరుతో వత్తుకుంటూ చివరి వరకు రావాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె కొద్దిగా వేడయ్యాక ముందుగా తయారు చేసుకున్న గోరు మిటీలను వేసి మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. తరువాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి.
ఇప్పుడు కళాయిలో పంచదార, నీళ్లు, యాలకులు వేసి వేడి చేయాలి. పంచదార కరిగి లేత తీగ పాకం వచ్చే వరకు వేడి చేయాలి. పంచదార మిశ్రమాన్ని నీటిలో వేసి చూస్తే మెత్తని ముద్దలా అవ్వాలి. ఇలా పాకం సిద్దం కాగానే స్టవ్ ఆఫ్ చేసి ముందుగా తయారు చేసుకున్న గోరు మిటీలపై ఈ పాకాన్ని వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, గుల్లగుల్లగా ఉండే గోరు మిటీలు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి. తీపి వంటకాలు ఏదైనా తినాలనిపించినప్పుడు లేదా పండుగలకు ఎంతో రుచిగా ఉండే ఈ గోరు మిటీలను చాలా సులభంగా తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.