Green Brinjal Fry : మనకు అందుబాటులో ఉండే కూరగాయల్లో వంకాయలు కూడా ఒకటి. వీటిల్లో అనేక రకాలు ఉంటాయి. ముఖ్యంగా మనకు పొడవు, గుండ్రంగా ఉండే వంకాయలు.. ఊదా, ఆకుపచ్చ రంగుల్లో అందుబాటులో ఉంటాయి. ఇవి మనకు ఏడాది పొడవునా లభిస్తాయి. వీటిని తినడం వల్ల మన శరీరానికి పోషకాలు లభిస్తాయి. అయితే ఊదా రంగు కన్నా ఆకుపచ్చ రంగులో ఉండే వంకాయలతోనే చాలా మంది కూరలు చేసుకుని తినేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. వాటిల్లో వంకాయ ఫ్రై కూడా ఒకటి. ఆకుపచ్చ రంగులో ఉండే వంకాయలనే తెల్ల వంకాయలు అని కూడా అంటారు. వీటితో వంకాయ ఫ్రైని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆకుపచ్చ వంకాయలతో ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
ఆకుపచ్చ వంకాయలు – పావు కిలో, నూనె – 50 ఎంఎల్, పచ్చి మిర్చి – 10 గ్రాములు, కరివేపాకు – 5 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 20 గ్రాములు, ఉప్పు – తగినంత, జీలకర్ర పొడి – 5 గ్రాములు, ఆవాలు – 2 గ్రాములు, పసుపు – చిటికెడు, కారం పొడి – 50 గ్రాములు, గరం మసాలా పొడి – 5 గ్రాములు, కొత్తిమీర – 2 గ్రాములు.
వంకాయ ఫ్రైని తయారు చేసే విధానం..
కడాయిలో నూనె వేసి వేయించాలి. జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఉప్పు, పసుపు వేసి వంకాయలు వేసి బాగా కలిపి మూడు నిమిషాల పాటు ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ మెత్తగా ఉడికించాలి. తరువాత కరివేపాకు, ఉప్పు, కారంపొడి, గరం మసాలా వేసి కలపాలి. రెండు నిమిషాలు ఉడికించిన తరువాత కొత్తిమీరతో గార్నిష్ చేసి వడ్డించాలి. దీంతో రుచికరమైన వంకాయ ఫ్రై రెడీ అయినట్లే. దీన్ని అన్నంతో తింటే భలే రుచిగా ఉంటుంది.