Green Chicken : నాన్ వెజ్ ప్రియులకు చికెన్ రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. చికెన్ తో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. కండరాలను బలంగా చేయడంలో, శరీరానికి కావల్సిన పోషకాలను అందించడంలో చికెన్ మనకు ఎంతో దోహదపడుతుంది. చికెన్ తో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. అందులో భాగంగా ఎంతో రుచిగా ఉండే గ్రీన్ చికెన్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రీన్ చికెన్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – అరకిలో, తరిగిన కొత్తిమీర – 2 కట్టలు ( పెద్దవి), తరిగిన పుదీనా – 2 కట్టలు ( పెద్దవి), పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన టమాటాలు – 2, తరిగిన పచ్చిమిర్చి – 8, పెరుగు – 50 గ్రా., సాజీరా – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 3, యాలకులు – 2, ఉప్పు – తగినంత, నూనె – 3 టేబుల్ స్పూన్స్, కారం – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – రెండు రెమ్మలు, బాదం పప్పు – 5.
గ్రీన్ చికెన్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, బాదం పప్పు, టమాట ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసి కలపాలి. వీటిని టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి. తరువాత కొత్తమీర, పుదీనా వేసి 3 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తరువాత ఒక జార్ లోకి తీసుకుని మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు వేసి వేయించాలి. తరువాత శుభ్రం చేసుకున్న చికెన్ ను వేసుకుని 5 నిమిషాల పాటు పెద్ద మంటపై వేయించాలి.
తరువాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా , ఉప్పు, కారం వేసి కలపాలి. దీనిని మరో 10 నిమిషాల పాటు పెద్ద మంటపై ఉడికించాలి. తరువాత 200 ఎమ్ ఎల్ నీళ్లు పోసి మూత పెట్టి 20 నిమిషాల పాటు చికెన్ పూర్తిగా ఉడికే వరకు మధ్యస్థ మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గ్రీన్ చికెన్ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే వంటకాలతో పాటు చికెన్ తో అప్పుడప్పుడూ ఇలా గ్రీన్ చికెన్ ను కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ చికెన్ ను కూడా అందరూ ఇష్టంగా తింటారు.