Green Chilli Pickle : పచ్చిమిర్చి.. వీటిని మనం వంట్లలో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. పచ్చిమిర్చిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తగిన మోతాదులో ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వీటితో మనం రకరకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాం. పచ్చిమిర్చితో చేసుకోదగిన రుచికరమైన పచ్చళ్లల్లో పచ్చిమిర్చి ఆవకాయ పచ్చడి కూడా ఒకటి. ఈ పచ్చడి నిల్వ కూడా ఉంటుంది. పచ్చిమిర్చితో చేసే ఈ ఆవకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే పచ్చిమిర్చి ఆవకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చిమిర్చి ఆవకాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చిమిర్చి – పావు కిలో, ఆవపిండి – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, నిమ్మకాయలు – 2.
పచ్చిమిర్చి ఆవకాయ పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఒక పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. తరువాత వాటిని అడ్డంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో అర టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. తరువాత ఇందులో నిమ్మరసం వేసి కలపాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఇందులో జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత పచ్చిమిర్చి ముక్కలు వేసి 3 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి.
తరువాత పసుపు. ఆవపిండి, ఉప్పు వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు కలుపుతూ వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ముక్కలు పూర్తిగా చల్లారిన తరువాత నిమ్మరసం వేసి కలపాలి. దీనిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పచ్చిమిర్చి ఆవకాయ తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. పచ్చిమిర్చిని వంటల్లో వాడడంతో పాటు అప్పుడప్పుడూ ఇలా పచ్చడిని కూడా తయారు చేసుకుని తినవచ్చు.