Green Chutney : మనం రెస్టారెంట్ లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లో చికెన్ తో చేసే రకరకాల పదార్థాలను తింటూ ఉంటాం. చికెన్ టిక్కా, చికెన్ కబాబ్, చిల్లీ చికెన్ ఇలా అనేక రకాల పదార్థాలను తింటూ ఉంటాం. ఈ వంటకాలను మనం ఇంట్లో కూడా తయారు చేస్తూ ఉంటాం. అయితే మనకు రెస్టారెంట్ లలో ఈ వంటకాలతో పాటు గ్రీన్ చట్నీని కూడా సర్వ్ చేస్తారు. గ్రీన్ చట్నీతో ఈ వంటకాలను కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. చికెన్ వెరైటీస్ కు చక్కటి రుచిని తెచ్చే ఈ గ్రీన్ చట్నీని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కేవలం 5 నిమిషాల్లో మనం ఈ గ్రీన్ చట్నీని తయారు చేసుకోవచ్చు. ఎంతో సులభంగా, త్వరగా అయ్యే ఈ గ్రీన్ చట్నీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రీన్ చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన కొత్తిమీర – ఒక కప్పు, పుదీనా ఆకులు – అర కప్పు, నిమ్మరసం – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్, ఉప్పు – ఒక టీ స్పూన్, నీళ్లు – పావు కప్పు, చిలికిన పెరుగు – అర కప్పు.
గ్రీన్ చట్నీ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో పెరుగు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో చిలికిన పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఇలా చేయడం వల్ల రుచిగా ఉండే గ్రీన్ చట్నీ తయారవుతుంది. ఈ విధంగా ఇంట్లోనే గ్రీన్ చట్నీని తయారు చేసుకుని ఎన్నో రకాల ఆహార పదార్థాలను తినవచ్చు.