Gulab Jamun Recipe : తీపిని మనలో చాలా మంది ఇష్టపడతారు. అలాగే మనం రకరకాల తీపి పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. చాలా తక్కువ సమయంలో చేసుకోదగిన తీపి పదార్థాల్లో గులాబ్ జామున్ ఒకటి. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని తయారు చేయడం కూడా చాలా సలుభం. ఈ గులాబ్ జామున్ లను మనం విరివిరిగా ఇంట్లో తయారు చేస్తూ ఉంటాం. అయితే ఒక్కోసారి ఈ గులాబ్ జామున్ లు లోపల ఉడకకుండా ముద్దగా ఉంటాయి. అలాగే వాటికి పగుళ్లు వస్తూ ఉంటాయి. ఇలా కాకుండా రుచిగా చక్కగా ఉండేలా కూడా ఈ గులాబ్ జామున్ లను మనం తయారు చేసుకోవచ్చు. కొన్ని చిట్కాలను పాటించడం వల్ల పగుళ్లు లేకుండా గులాబ్ జామున్ లను మనం తయారు చేసుకోవచ్చు. రుచిగా, చక్కగా ఉండే గులాబ్ జామున్ లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గులాబ్ జామున్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఇన్ స్టాంట్ గులాబ్ జామున్ మిక్స్ – ఒక పెద్ద కప్పు లేదా ఒక ప్యాకెట్, పాలు – 60 ఎమ్ ఎల్, నీళ్లు – 60 ఎమ్ ఎల్, పంచదార – రెండు పెద్ద కప్పులు, కచ్చాపచ్చాగా దంచిన యాలకులు – 6, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
గులాబ్ జామున్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పాలను అలాగే నీళ్లను పోసి కలుపుకోవాలి. తరువాత మరో గిన్నెలో గులాబ్ జామున్ మిక్స్ ను తీసుకోవాలి. తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న పాలను పోసుకుంటూ నెమ్మదిగా వేళ్లతో కలుపుకోవాలి. ఈ పిండిని ఎక్కువగా బలాన్ని ఉపయోగించి గట్టిగా కలుపుకోకూడదు. ఇలా కలుపుకున్న తరువాత పిండిపై మూతను ఉంచి 30 నిమిషాల పాటు నానబెట్టాలి. తరువాత కళాయిలో గులాబ్ జామున్ మిక్స్ ను తీసుకున్న గిన్నెతో రెండు కప్పుల పంచదారను తీసుకోవాలి. తరువాత అదే కప్పుతో రెండు కప్పుల నీటిని పోసి పంచదార కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. ఇందులోనే యాలకులను కూడా వేయాలి. ఈ పంచదార మిశ్రమాన్ని కొద్దిగా బంకగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత యాలకులను పాకం నుండి తొలగించాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మరోసారి నెమ్మదిగా కలుపుకోవాలి.
తరువాత ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలు అన్నీ సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఈ ఉండలను రెండు చేతుల మధ్య కొద్దిగా వత్తుకుంటూ గుండ్రని ఉండలుగా చేసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె కొద్దిగా కాగిన తరువాత గులాబ్ జామున్ లను వేసి చిన్న మంటపై కాల్చుకోవాలి. వీటిని ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని పంచదార పాకంలో వేసుకోవాలి. గులాబ్ జామున్ లను వేసుకునేటప్పుడు పంచదార పాకం గోరు వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల చక్కగా ఉండే గులాబ్ జామున్ లు తయారవుతాయి. వీటిని ఒక గంట పాటు పంచదార పాకంలో నానిన తరువాత సర్వ్ చేసుకోవాలి. తీపి తినాలనిపించినప్పుడు ఇలా చాలా త్వరగా అయ్యేలా గులాబ్ జామున్ లను తయారు చేసుకుని తినవచ్చు. ఈ చిట్కాలను పాటిస్తూ గులాబ్ జామున్ లను చేయడం వల్ల గులాబ్ జామున్ లు చక్కగా వస్తాయి.