Healthy Chaat : మనకు సాయంత్రం సమయంలో బండ్ల మీద లభించే వాటిలో చాట్ కూడా ఒకటి. చాట్ చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ దీనిని ఇష్టంగా తింటారు. చాట్ ను మనం ఇంట్లో కూడా తయారు చేస్తూ ఉంటాము. స్నాక్స్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. అయితే తరుచూ ఒకేరకం చాట్ కాకుండా దీనిని మరింత రుచిగా ఆరోగ్యానికి మేలు చేపేలా కూడా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా తయారు చేసే హెల్తీ చాట్ చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. పిల్లలకు దీనిని ఇవ్వడం వల్ల వారికి చక్కటి ఆరోగ్యాన్ని అందించవచ్చు. రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ హెల్తీ చాట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హెల్తీ చాట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
రాత్రంతా నానబెట్టిన బఠాణీలు – ఒక కప్పు, నీళ్లు – రెండు కప్పులు, ఉప్పు – కొద్దిగా, పసుపు – కొద్దిగా, నల్ల నువ్వులు – పావు కప్పు, ఆవాల నూనె – 2 టీ స్పూన్స్, తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉడికించిన బంగాళాదుంపలు – 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మరసం – పులుపుకు తగినంత.
హెల్తీ చాట్ తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో బఠాణీలు వేసి నీళ్లు పోయాలి. తరువాత కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి బఠానీలను మెత్తగా ఉడికించాలి. బఠాణీలు మెత్తగా ఉడికిన తరువాత వాటిని వడకట్టి పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నల్ల నువ్వులు వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉడికించిన బంగాళాదుంపలను ముక్కలుగా చేసి వేసుకోవాలి. తరువాత ఉడికించిన బఠాణీలను, రుచికి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి కలపాలి. వీటిని 3 నిమిషాల పాటు వేయించిన తరువాత కొత్తిమీర వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడి వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు వేయించి నిమ్మరసం కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చాట్ తయారవుతుంది. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.