Home Made Aloo Chips : మనకు స్వీట్ షాపులల్లో, చిరుతిళ్లు అమ్మే దుకాణాలల్లో ఎక్కువగా లభించే వాటిలో ఆలూ చిప్స్ కూడా ఒకటి. ఆలూ చిప్స్ కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ వీటిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా, సైడ్ డిష్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. బయట లభించే ఈ ఆలూ చిప్స్ ఎంత రుచిగా, క్రిస్పీగా ఉంటాయో అచ్చం అదే విధంగా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ ఆలూ చిప్స్ ను తయారు చేయడం చాలా తేలిక. క్రిస్పీగా, రుచిగా ఉండే ఈ ఆలూ చిప్స్ ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రిస్పీ ఆలూ చిప్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బంగాళాదుంపలు – పెద్దవి రెండు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, ఉప్పు – కొద్దిగా.
క్రిస్పీ ఆలూ చిప్స్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఉప్పును తీసుకుని అందులో నీళ్లు పోసి కలపాలి. ఉప్పు కరిగిన తరువాత గిన్నెను పక్కకు ఉంచాలి. తరువాత బంగాళాదుంపలపై ఉండే చెక్కును తీసి కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యే లోపు నూనెకు సరిపడా బంగాళాదుంప స్లైస్ లను తరగాలి. నూనె వేడయ్యాక ఆలూ స్లైస్ లను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. వీటిని ముందుగా 5 నిమిషాల పాటు పెద్ద మంటపై వేయించాలి.
తరువాత ఈ చిప్స్ పై ముందుగా కలిపిన ఉప్పు నీటిని చల్లుకోవాలి. తరువాత వీటిని క్రిస్పీగా అయ్యే వరకు మధ్యస్థ మంటపై వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. మరలా నూనెకు సరిపడా ఆలూ స్లైసెస్ ను కట్ చేసుకుని వేయించుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత పైన ఉప్పు చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే బంగాళాదుంప చిప్స్ తయారవుతాయి. ఇలా ఇంట్లోనే సులభంగా క్రిస్పీ ఆలూ చిప్స్ ను తయారు చేసుకుని తినవచ్చు.