Pudina Tomato Chutney : మనం పుదీనాను వంటల్లో విరివిగా వాడుతూ ఉంటాము. అలాగే ఈ పుదీనాతో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. పుదీనాతో చేసుకోదగిన రుచికరమైన చట్నీలలో పుదీనా టమాట చట్నీ కూడా ఒకటి. పుదీనా, టమాటాలు కలిపి చేసే ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. కూరలేకున్నా కూడా ఈ చట్నీతో మనం కడుపు నిండుగా భోజనం చేయవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే పుదీనా టమాట చట్నీని ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనా టమాట చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – 3 టీ స్పూన్స్, నూనె – టీ స్పూన్స్, పచ్చిమిర్చి – 10 లేదా తగినన్ని, తరిగిన టమాటాలు – 2, పుదీనా ఆకులు – 2 కప్పులు, చింతపండు – చిన్న నిమ్మకాయంత, అల్లం- ఒక ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 8, ఉప్పు – తగినంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు -ఒక రెమ్మ.
పుదీనా టమాట చట్నీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో పల్లీలు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో పచ్చిమిర్చి వేసి వేయించాలి. పచ్చిమిర్చి వేగిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని అదే కళాయిలో టమాట ముక్కలు వేసి కలపాలి. తరువాత చింతపండు, పుదీనా ఆకులు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత జార్ లో పల్లీలు, పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
తరువాత వేయించిన టమాట, పుదీనా వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తాళింపుకు కళాయిలో నూనె వేసి వేయించాలి. తరువాత తాళింపు పదార్థాలు ఒక్కొక్టకిగా వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసి పచ్చడిని వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పుదీనా టమాట చట్నీ తయారవుతుంది. దీనిని అన్నంతో పాటు అల్పాహారాలతో కూడా తినవచ్చు. ఈ విధంగా తయారు చేసిన టమాట పుదీనా చట్నీని లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.