Hotel Style Curd Rice : మనం ఆహారంలో భాగంగా పెరుగును కూడా తీసుకుంటూ ఉంటాం. పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికి తెలుసు. ఎముకలను, దంతాలను ధృడంగా ఉంచడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో, శరీరానికి చలువ చేయడంలో పెరుగు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వంటల్లో వాడడంతో పాటు ఈ పెరుగుతో ఎంతో రుచిగా ఉండే కర్డ్ రైస్ ను కూడా తయారు చేస్తూ ఉంటాం. ఈ కర్డ్ రైస్ తయారు చేయడం చాలా సలుభం. దీనిని తరచూ తయారు చేస్తూ ఉంటారు. అయితే ఈ కర్డ్ రైస్ ను మరింత రుచిగా రెస్టారెంట్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రెస్టారెంట్ స్టైల్ కర్డ్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – అర కప్పు, తియ్యటి పెరుగు – అర కిలో, పాలు – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – లీటర్, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి తరుగు – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, క్రీమ్ – పావు కప్పు.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 4, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, జీడిపప్పు పలుకులు – 10, కరివేపాకు – రెండు రెబ్బలు.
రెస్టారెంట్ స్టైల్ కర్డ్ రైస్ తయారీ విధానం..
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టాలి. తరువాత ఒక కళాయిలో నానబెట్టుకున్న బియ్యం, నీళ్లు, పాలు పోసి ఉడికించాలి. నీళ్లు అయ్యి పోయి అన్నం మెత్తగా అయ్యే వరకు 25 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. కొద్దిగా నీరు మిగిలి ఉండగానే అన్నాన్ని గంటెతో మెత్తగా చేసుకోవాలి. తరువాత పచ్చిమిర్చి, అల్లం తరుగు, ఉప్పు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారే వరకు అలాగే ఉంచాలి. ఈ అన్నం చల్లారిన తరువాత ముద్దగా తయారవుతుంది. తరువాత దీనిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు పెరుగు వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. తరువాత క్రీమ్ వేసి కలపాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత వీటిని ఒక జల్లిగంటెలోకి తీసుకుని నూనె అంతా పోయేలా వడకట్టాలి. తరువాత మిగిలిన తాళింపు నుండి సగం తాళింపును ముందుగా సిద్దం చేసుకున్న అన్నంలో వేసి కలపాలి.
ఇప్పుడు ఈ పెరుగన్నాన్ని గంట పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. గంట తరువాత అన్నం గిన్నెరను బయటకు తీసి దానిపై క్యారెట్ తురుము, మిగిలిన తాళింపు వేసి గార్నిష్ చేసుకోవాలి. దీనిపై దానిమ్మ గింజలను కూడా చల్లుకోవచ్చు. ఇలా చేయడం వల్ల అచ్చం రెస్టారెంట్ లలో లభించే విధంగా ఉండే కర్డ్ రైస్ తయారవుతుంది. ఈ రైస్ తిన్నా కొద్ది తినాలనిపించేత రుచిగా ఉంటుంది. ఈ విధంగా కర్డ్ రైస్ ను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. పిల్లలు కూడా ఈ కర్డ్ రైస్ ను చాలా ఇష్టంగా తింటారు.