Hotel Style Egg Dosa : మనకు హోటల్స్ లభించే వివిధడ రకాల రుచికరమైన దోశలల్లో ఎగ్ దోశ కూడా ఒకటి. ఎగ్ దోశ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇస్టంగా తింటూ ఉంటారు.బయట హోటల్స్ లభించే ఈ ఎగ్ దోశను అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ దోశను తయారు చేయడం చాలా సులభం. ఇంట్లో దోశ పిండి, ఎగ్స్ ఉంటే చాలు చిటికెలో ఈ దోశలను తయారు చేసుకుని తినవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ ఎగ్ దోశలను హోటల్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హోటల్ స్టైల్ ఎగ్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
దోశపిండి – తగినంత, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
దోశ కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్,తరిగిన ఉల్లిపాయ – పెద్దది ఒకటి, వెల్లుల్లి రెబ్బలు – 10, చింతపండు – ఒక రెమ్మ, ఎండుమిర్చి – 8 లేదా తగినన్ని, ఉప్పు – తగినంత.
హోటల్ స్టైల్ ఎగ్ దోశ తయారీ విధానం..
ముందుగా దోశ కారం తయారు చేసుకోవడానికి గానూ కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఎండుమిర్చి వేసి కలపాలి. ఇప్పుడు వీటిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తరువాత జార్ లోకి తీసుకుని ఇందులోనే ఉప్పు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. తరువాత పిండిని తీసుకుని మరీ పెద్దగా, మరీ పలుచగా కాకుండా కొద్దిగా మందంగా ఉండేలా దోశను వేసుకోవాలి.
తరువాత దీనిపై మిక్సీ పట్టుకున్న కారాన్ని రాసుకోవాలి. తరువాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర చల్లుకుని దానిపై గుడ్డును వేసుకోవాలి. తరువాత గుడ్డును స్ప్రెడ్ చేసుకుని కాల్చుకోవాలి. దీనిని నూనె వేసి కాల్చుకున్న తరువాత మరో వైపుకు తిప్పి మరో అర నిమిషం పాటు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే హోటల్ స్టైల్ ఎగ్ దోశ తయారవుతుంది. దీనిని చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది.