Hotel Style Masala : తందూరి మసాలా.. మనకు మార్కెట్ లో ఈ మసాలా ప్యాకెట్లు లభిస్తూ ఉంటారు. ఈ తందూరి మసాలాను ఉపయోగించి చికెన్ తందూరి, టిక్కా వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. అయితే మార్కెట్ లో లభించే తందూరి మసాలాను వాడడానికి బదులుగా మనం ఇంట్లోనే ఈ తందూరిమసాలాను తయారు చేసుకోవచ్చు. హోటల్స్ ఎక్కువగా ఈ ఇప్పుడు చెప్పే ఈ తందూరి మసాలానే వాడుతూ ఉంటారు. కింద చెప్పిన విధంగా తయారు చేసే తందూరి మసాలా ఘాటుగా, చక్కటి వాసనతో ఉంటుంది. దీనితో తందూరినే కాకుండా నాన్ వెజ్ వంటకాలను కూడా తయారు చేసుకోవచ్చు. హోటల్స్ తందూరికి వాడే తందూరి మసాలాను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తందూరి మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, సోంపు గింజలు – ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, ఎండుమిర్చి – 10 నుండి 12, దాల్చిన చెక్క – 6 ఇంచుల ముక్కలు, లవంగాలు -ఒక టీ స్పూన్, యాలకులు – 15 నుండి 18, అనాస పువ్వులు – 2, మిరియాలు – 2, జాపత్రి – 1, శొంఠి ముక్కలు -ఒక టీ స్పూన్, కసూరిమెంతి – ఒక టీ స్పూన్, డ్రై మ్యాంగో పౌడర్ – ఒక టీ స్పూన్.
తందూరి మసాలా తయారీ విధానం..
ముందుగా కళాయిలో ధనియాలు, జీలకర్ర, సోంపు గింజలు, బిర్యానీ ఆకును ముక్కలుగా చేసి వేసి వేయించాలి. వీటిని చక్కగా వేయించిన తరువాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, మిరియాలు, జాపత్రి వేసి వేయించాలి. వీటిని కూడా మాడిపోకుండా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తరువాత జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇదే జార్ లో శొంఠి, డ్రై మ్యాంగో పౌడర్, కసూరిమెంతి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడి చల్లారిన తరువాత గాజు సీసాలో వేసుకుని గాలి తగలకుండా మూత పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కమ్మటి వాసనతో ఉండే తందూరి మసాలా తయారవుతుంది. ఈ విదంగా తయారు చేసిన తందూరి మసాలాతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.