Hotel Style Pesarattu : మనం పెసర్లను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందన్న సంగతి మనకు తెలిసిందే. పెసర్లను తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. గుండె జబ్బుల బారిన పడకుండా ఉంటారు. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఈ పెసర్లను మొలకెత్తించి తీసుకోవడంతో పాటు వీటితో వివిధ రకాల వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. పెసర్లతో ఎక్కువగా చేసే వంటకాల్లో పెసరట్టు ఒకటి. దీనిని రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. పెసరట్టును తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. రుచిగా, అందరికి నచ్చేలా పెసరట్టును ఎలా తయారు చేసుకోవాలి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెసరట్టు తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసర్లు – 2 చిన్న గ్లాసులు, బియ్యం – అర గ్లాస్, పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం తరుగు – ఒకటిన్నర టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2.
పెసరట్టు తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పెసర్లను, బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తరువాత పెసర్లను మరోసారి శుభ్రంగా కడగాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని పసుపు వేసుకోవాలి. తరువాత కొద్దిగా నీటిని పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి పిండిని కలుపుకోవాలి. పిండి మరీ పలుచగా కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తరుగు, జీలకర్ర వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక తగినంత పిండిని తీసుకునిపెసరట్టు వేసుకోవాలి. తరువాత కలిపి ఉంచిన ఉల్లిపాయ ముక్కలను పెసరట్టుపై చల్లుకోవాలి. తరువాత తగినంత నూనె వేసి కాల్చుకోవాలి. దీనిని మరో వైపుకు తిప్పే అవసరం లేదు.
దీనిని ఒక వైపు మాత్రమే ఎర్రగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెసరట్టు తయారవుతుంది. దీనిని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం స్నాక్స్ గా కూడా ఈ పెసరట్టును తయారు చేసుకుని తినవచ్చు. ఈ విధంగా పెసర్లతో పెసరట్టును తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ పెసరట్టును ఎన్ని తినామ్మో తెలియకుండా ఒకటి ఎక్కువగానే తింటారు.